కరీంనగర్ విద్యానగర్, జూన్ 29 : వైద్యరంగంలో హోమియోను మించిన వైద్యం లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని పద్మనగర్‌లో గల ప్రకృతి హోటల్లో ఐదో రాష్ట్రస్థాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ సైంటిఫిక్ సెమినార్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సెమినార్లో హోమియో వైద్యులు కొడిత్యాల శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డాక్టర్ గణేశ్ ఆచారి, డాక్టర్ హీరాలాల్ అగర్వాల్ తదితరులు సైంటిఫిక్ సెమినార్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. తన స్వీయ అనుభవాన్ని వివరించారు. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్‌కు మానేరు రివర్ ఫ్రంట్, స్టడీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక బృందాన్ని సియోల్‌కు పంపించిందని, అకడికి వెళ్లగానే తనకు విపరీతమైన దగ్గు రాగా వారంపాటు ఇబ్బంది పడినట్టు గుర్తుచేశారు. అకడి వైద్యులతోపాటు కరీంనగర్, హైదరాబాద్ వంటి ఎన్నో కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి ఎన్ని పరీక్షలు చేయించుకున్నా తగ్గలేదని తెలిపారు.
చివరికి హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ దవాఖాన వాళ్లు ఏకంగా శస్త్రచికిత్స అవసరమని చెప్పారని, వెంటనే తనతో ఉన్న అప్పటి మంత్రి ఒకరు హైదరాబాద్‌లోని ఓ హోమియో వైద్యుడి పేరును సిఫారసు చేశారని తెలిపారు. ఆ మేరకు సదరు వైద్యుడికి ఫోన్ చేయగా వెంటనే స్పందించిన ఆయన వీడియో కాల్‌లోనే లక్షణాలు తెలుసుకొని గుళికల లాంటి మందులు పంపించినట్టు చెప్పారు. ఆ మందులు వాడిన వారం రోజుల్లోనే దగ్గు తగ్గిపోయిందని తెలిపారు. అల్లోపతిలో ఎంతోమంది వైద్యులు ఉంటారని, అదే హోమియోపతి మందులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకపోవడం శుభపరిణామమని తెలిపారు. అనంతరం 2025-27 సంవత్సరానికి రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హరికృష్ణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శివమూర్తి, చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఏ రావు తదితరులు పాల్గొన్నారు.