దుక్కి దున్నింది మొదలు పంట పండించే దాకా గొడ్డు కష్టం చేస్తున్న రైతుకు చివరికి ఆ పంటను అమ్ముకుందామన్నా అరిగోస తప్పడం లేదు. ఓ వైపు అనేక కొర్రీలతో సర్కారు ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేస్తుండగా మరోవైపు ‘తరుగు’ పేరిట ఆయా సెంటర్ల నిర్వాహకులు అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తున్నారు. క్వింటాలుకు 5 కిలోల వడ్లను తరుగు పేరిట కోత పెడుతున్నారు. ఇలా ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇప్పటి వరకు రూ.9 కోట్లపైగా విలువైన ధాన్యం తరుగు పేరిట మిల్లులకు చేరినట్టు తెలుస్తుండగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక దొడ్డు వడ్లను కొనేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిరాకరిస్తుంటే విధిలేక రైతులు వడ్ల బస్తాలను మిల్లుల వైపు తరలిస్తున్నారు. అక్కడా మిల్లర్లు ససేమిరా అంటుండటంతో ట్రాక్టర్లు, లారీలతో రోడ్లపైనే బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు శనివారం సైతం కురిసిన అకాల వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సెంటర్లలో ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి.
Telangana | నమస్తే నెట్వర్క్: మార్కెట్ల మాయాజాలంతో అన్నదాత నిలువుదోపిడీకి గురవుతున్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే చోట తీవ్రంగా నష్టపోతున్నాడు. తరుగు పేరిట ధాన్యం కోతలు విధిస్తూ రైతులను మోసగిస్తున్నారు. ఫలితంగా ఒక్కో రైతు వేలాది రూపాయలు నష్టపోతున్నాడు. నష్టం జరుగుతుందని తెలిసినా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పాలకులు అసలే పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తరుగు పేరిట రైతుల ధాన్యాన్ని క్వింటాలుకు 5.50 కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారు.
సింగిల్‌విండోలు, ఐకేపీ, డీసీఎంఎస్, హాకా తదితర కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట ఈ దోపిడీ జరుగుతూనే ఉన్నది. ప్రతి క్వింటాలుకు సంచి బరువు 250 గ్రాములు కాకుండా 5 కిలోల తరుగు తీస్తుండగా, 100 క్వింటాళ్లు అమ్ముకున్న ఒక రైతు తరుగు పేరిట 5 క్వింటాళ్లు కోల్పోవాల్సి వస్తున్నది. మద్దతు ధరతో చూస్తే 100 క్వింటాళ్లు అమ్ముకున్న రైతు రూ.11,160 మేరకు నష్టపోతున్నాడు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం వరకు 12,344 మంది రైతుల నుంచి 99,408 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ లెక్కన చూస్తే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.9 కోట్లకు పైగా విలువైన ధాన్యం తరుగు పేరిట మిల్లులకు చేరినట్టు స్పష్టమవుతున్నది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనడం లేదని కర్షకులు నిరసనకు దిగారు. సరైన సమయంలో కొనకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి పాడవుతున్నదని వాపోయారు.
ఎండనకా వాననకా కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు రైతులు గోస పడుతున్నారు. సన్నాలు తప్ప దొడ్డు వడ్లు కొనబోమని కొనుగోలు కేంద్రాల్లో తెగేసి చెప్పడం.. మిల్లర్ల వద్దకు పోతే అక్కడా కొనకపోవడంతో దిగాలు చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు రోడ్డులో ఓ మిల్లు వద్ద శనివారం ధాన్యం లోడుతో బారులు తీరిన ట్రాక్టర్లు
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ జాప్యం కారణంగా కేంద్రాల్లో నిల్వ చేసిన వడ్లు అకాల వర్షాలకు తడిసిపోయి అన్నదాతలకు మరింత నష్టం వాటిల్లుతున్నది. శనివారం కురిసిన వర్షానికి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మార్కెట్ యార్డులో వరదలోకొట్టుకుపోతున్న ధాన్యం
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని షరతుల్లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో పలువురు నేతలు మార్కెట్ యార్డులో రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. జరిగిన నష్టం తెలుసుకొని రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దాదాపు 20 వేల బస్తాలు వర్షానికి తడిశాయని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు, బీఆర్ఎస్ నేతలు ఆందోళనను విరమించారు.
తరుగు, కొర్రీలు లేకుండా, కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, తిరుమలాయపాలెం, చండ్రుగొండ మండలాల్లో శనివారం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మధిర-విజయవాడ ప్రధాన రహదారిపై శనివారం ధర్నా నిర్వహించారు. 15 రోజులు అవుతున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసుల చొరవతో ఆందోళన విరమించారు.
కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల తరుగు దోపిడీని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మార్కెట్ గోదాముల సముదాయంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు శనివారం ఆందోళనకు దిగారు. క్వింటాకు 5 నుంచి 7 కిలోల వరకు తరుగు ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేయడంతో ససేమిరా అన్న రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో పట్టపగలే ఇంత దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మిల్లర్ల అవినీతిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బందంపల్లి గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ప్రధాన రహదారిపై శనివారం రాస్తారోకో నిర్వహించారు.
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ఆందోళనకు అధికారులు దిగొచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బాలంపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ఏప్రిల్ 25న కేంద్రాన్ని ప్రారంభించినా, హమాలీల కొరతతో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాయగిరి, బాలంపల్లి గ్రామాలకు చెందిన రైతుల ధాన్యం రాశులు 90కి పైగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం రైతులు కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన అధికారులు శనివారం సాయంత్రం కొనుగోళ్లు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
నారాయణపేట జిల్లాలో చేతికొచ్చిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లనే కొంటం, దొడ్డు రకం కొనబోమని తెగేసి చెప్తున్నారు. దీంతో చేసేదిలేక రైస్ మిల్లుల వద్దకు వెళ్తే అక్కడా ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. జిల్లాలోని మద్దూరు మండల కేంద్రం నుంచి పెదిరిపాడు రోడ్డులో ఉన్న పద్మావతి రైస్‌మిల్లు వద్దకు దాదాపు 60 ట్రాక్టర్లు ధాన్యం లోడుతో వచ్చాయి. మిల్లు యాజమాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఎస్సై, అధికారుల చొరవతో 20 వాహనాలకు రైతులకు టోకెన్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. సింగారం చౌరస్తా సమీపంలోని రైస్‌మిల్లు వద్ద ధాన్యంలోడుతో ఉన్న వాహనాలు పెద్ద ఎత్తున బారులుతీరాయి. రెండ్రోజులుగా ధాన్యం విక్రయించేందుకు పడిగాపులు కాయాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన చెందారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ట్రాక్టర్లలోకి ఎత్తుతున్న హమాలీలు
ఆమనగల్లులో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయాలని నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కొనుగోలు కేంద్రంలో ఆందోళన చేస్తున్న రైతులు
నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఆందోళన చేస్తున్న రైతులు