హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): పెన్షన్ ఖాతాలో ఎంతో కొంత సొమ్ములుంటే అక్కరుకొస్తాయన్న ధీమా ఉంటుంది. కానీ, ఆ డబ్బులను వెనక్కి ఇవ్వబోమని ప్రభుత్వమే అంటే గుండెలు గుభేల్‌మంటాయి. నేడు నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లోని ఉద్యోగుల పరిస్థితి అచ్చం ఇలాగే ఉన్నది. ఎన్‌పీఎస్‌లో దాచుకున్న డబ్బులను వెనక్కి ఇవ్వబోమని ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించడంతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)లోని ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. మా డబ్బులను ఎందుకు ఇవ్వరని, వాటిపై మీ పెత్తనం ఏమిటని నిర్మలమ్మను నిలదీస్తున్నారు. ప్రభుత్వమే దగాచేస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ పథకంలోని 2 లక్షల మంది తెలంగాణ ఉద్యోగులకు చెందిన సుమారు రూ.22 వేల కోట్లు కేంద్ర ఆర్థికశాఖ ఆధీనంలో ఉన్నాయి.
ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే పాత పెన్షన్ పథకానికి 2004లో బీజేపీ ప్రభుత్వం ముగింపు పలికి ఎన్పీఎస్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. దీనినే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) అని కూడా అంటున్నారు. ఈ పథకం కింద ఉద్యోగులు 10% సొమ్మును, ప్రభుత్వం మరో 10% సొమ్మును జమచేస్తే ఆ మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెడతారు. ఇలా ప్రభుత్వం ఓ వ్యాపార సంస్థలా వ్యవహరించి ఉద్యోగుల సొమ్ముతో ధనార్జన చేయడం అత్యంత దారుణం. ఎన్పీఎస్ నుంచి రాష్ర్టాలు స్వచ్ఛందంగా వైదొలగవచ్చని సాక్షాత్తు పార్లమెంట్లో ప్రకటించిన కేంద్రమే ఇప్పుడు మాటమార్చి కొత్త మెలికపెడుతుండటం గమనార్హం.
ఉద్యోగులను చక్రబంధంలోకి నెట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్రం పీఎఫ్ఆర్డీఏ చట్టం లో కుట్రపూరిత నిబంధనలను పెట్టింది. ఈ చట్టం ప్రకారం సీపీఎస్‌కు బదులుగా పాత పెన్షన్ స్కీంలో చేరే అంశంపై రాష్ట్రాలకు ఆప్షన్ ఇచ్చారు. ఉద్యోగుల సామాజిక భద్రత కల్పించడంలో ఈ పథకం సఫలీకృతం కాకపోతే పదేండ్లలో రద్దు చేసుకోవచ్చని ఇదే చట్టంలో పేర్కొన్నారు. కానీ, తిరిగి పాత విధానంలోకి వెళ్లడంపై స్పష్టతనివ్వలేదు. ఎలా వెళ్లాలో మార్గదర్శకాలను రూపొందించలేదు. దీనిని సాకుగా తీసుకొని కేంద్రం పెత్తనం చెలాయిస్తున్నదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు ఎన్పీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాయి. ఇటీవలే రాజస్థాన్ తమ రాష్ట్ర పెన్షన్ ఫండ్‌ను వెనక్కి ఇవ్వాలని పీఎఫ్ఆర్డీఏకు లేఖ రాసింది.
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు వెనక్కి ఇవ్వబోని కేంద్రం అనడం దేశవ్యాప్తంగా కోటి మంది, తెలంగాణలో 2 లక్షల మంది ఉద్యోగులను మోసగించడమే. ఆ డబ్బులను కార్పొరేట్లకు మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పాలసీ తీసుకొచ్చి ఎప్పుడు వీలైతే అప్పుడు జమ అయిన సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించాలి.
– కమలాకర్, తెలంగాణ సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఎన్పీఎస్లోని సొమ్మును రాష్ర్టాలకు తిరిగి ఇచ్చేది లేదనడం ముమ్మాటికీ ఆక్షేపనీయమే. ఎన్పీఎస్లోని రాష్ర్టాల పెన్షన్ నిధిని రాబట్టేందుకు సీఎం కేసీఆర్ అన్ని రాష్ట్రాల తరఫున పోరాడుతారు. మేము కూడా ఆయనతో కలిసి నడుస్తాం. అం దుకు నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్ష న్స్ సీం (ఎన్ఎమ్వోపీఎస్) ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తుంది.
– స్థితప్రజ్ఞ, ఎన్‌ఎంవోపీఎస్ సెక్రటరీ జనరల్