TG DSC | హైదరాబాద్/ ఆదిలాబాద్, అక్టోబర్ 15 (నమస్తేతెలంగాణ)/ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్: డీఎస్సీ-2024లో భాగంగా కొత్త టీచర్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొన్నది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వాలి. బుధవారం విధుల్లో రిపోర్ట్ చేయాలి. కానీ నేడు ఉదయం కొన్ని జిల్లాల్లో సెలెక్షన్ లిస్ట్‌లు రాకపోవడం, సాంకేతిక సమస్యలతో వాయిదావేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం అందించారు. అయితే కొన్ని గంటల తర్వాత సెలెక్షన్ లిస్ట్‌లు రావడం, సాంకేతిక సమస్యలు పరిష్కరించడడంతో కౌన్సెలింగ్ యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే అప్పటికే కౌన్సెలింగ్ సెంటర్లనుంచి వెనుదిరిగిన అభ్యర్థులు, తిరిగి పరుగుపరుగునా సెంటర్లకు చేరుకున్నారు.
మంగళవారం ఉదయం టీచర్ల కౌన్సెలింగ్ వాయిదాకు సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెప్పినప్పటికీ.. అసలు కారణం 317 జీవోనే అని విశ్వసనీయంగా తెలిసింది. ఈ జీవో ద్వారా పలువురు సీనియర్లు స్థానికతను కోల్పోవడంతో దూరప్రాంతాలకు బదిలీ చేశారు. వారు తమ సమస్యను పరిష్కరించకుండా డీఎస్సీ-2024లో సెలక్ట్ అయిన వారికి ఏవిధంగా పోస్టింగ్స్ ఇస్తారని అభ్యంతరం వ్యక్తంచేశారు. కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని కోరారు. అయితే వీరి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేవరకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించవద్దని విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోలకు సూచించారు. దీనిపై సర్కారు స్పష్టత ఇవ్వడంతో కౌన్సెలింగ్ కొనసాగించారు. అయితే ఈ గందరగోళం కారణంగా మిగిలిపోయిన అభ్యర్థులకు బుధవారం సైతం కౌన్సెలింగ్ చేస్తామని అధికారులు తెలిపారు. కొత్త టీచర్లు ఈ నెల 16(నేడు)లోగా విధుల్లో చేరాల్సి ఉన్నందున ఏ ఒక్కరూ ఇబ్బందిపడే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.
చీకట్లో కొనసాగిన డీఎస్సీ నియమాక కౌన్సెలింగ్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో డీఎస్సీ 2024 అభ్యర్థుల నియమాక కౌన్సెలింగ్ చీకట్లోనే కొనసాగింది.
కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు సరైన సౌకర్యాలు లేక చీకట్లో అవస్థలు పడ్డారు. కనీస సౌకర్యాలు… pic.twitter.com/CMNwDV9oIU
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024
జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది అక్రమాల కారణంగా అర్హులైన వారికి ఉద్యోగాలు రాలేదంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆదిలాబాద్‌లో ఆందోళనకు దిగారు. దీంతో కౌన్సెలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో 266 పోస్టులకు మంగళవారం కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కనీస నిబంధనలు పాటించకుండా అర్హులను పక్కన పెట్టి డబ్బులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కేటాయించారంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవో ప్రణీతను నిలదీశారు. అనంతరం డీఈవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలీసులు బలవంతంగా వారిని బయటకు పంపించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడారు. నష్టపోయిన ముగ్గురికి కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించారు. ప్రస్తుతం అండర్ టేకింగ్ కల్పించి మూడు రోజుల్లో వారికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలల రాత్రి వరకు కౌన్సెలింగ్ కొనసాగింది. కేంద్రంలో కరెంట్ లేక చీకట్లో అభ్యర్థులు, అధికారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాగు నీటి సౌకర్యం సైతం కల్పించలేదు. కూర్చోవడానికి సైతం కుర్చీలు లేక అభ్యర్థులు కింద కూర్చున్నారు.