TG Budget | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రగతికి దిక్సూచిలా ఉండాల్సిన బడ్జెట్, అభివృద్ధికి విఘాతం కలిగించే కోతల చిట్టాగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంకెలను అద్భుతంగా చూపిస్తూనే, క్షేత్రస్థాయిలో రాష్ట్రానికి వెన్నెముక లాంటి కీలక రంగాలకు నిధులు తగ్గించారు. వ్యవసాయ రాష్ట్రమైన తెలంగాణలో సాగు రంగానికి బడ్జెట్ ఊపిరిపోస్తుందని భావిస్తే, ప్రభుత్వం పూర్తిగా నిరాశ పరిచింది.
పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు. కేటాయింపుల్లోనూ రూ.1,200 కోట్ల మేర కోత విధించారు. గిరిజన సంక్షేమానికి కూడా గతంలో ఉన్న రూ.17,169 కోట్లను రూ.7,937 కోట్లకు కుదించారు. అణగారిన వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వారికి మొండిచేయి చూపిందనే విమర్శలొస్తున్నాయి. యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమల శాఖకు నిధులు తగ్గించడమే కాకుండా, ఆత్మహత్యల అంచున ఉన్న చేనేత కార్మికులకు దకాల్సిన స్వల్ప నిధుల్లోనూ కోత విధించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొంటూనే.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి పాతర వేయడం, సాగునీరు, వ్యవసాయం వంటి ప్రాధాన్య రంగాలను నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
2026-27 బడ్జెట్ ప్రతిపాదనలు గమనిస్తే, గత ఏడాదితో పోలిస్తే దాదాపు అన్ని కీలక శాఖల్లో కేటాయింపులు భారీగా తగ్గడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటూనే.. సాగు రంగాన్ని విస్మరించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిల్చింది. నీటి పారుదల శాఖకు కేటాయింపులు రూ.23,373 కోట్ల నుంచి రూ.22,165 కోట్లకు పడిపోయాయి. వ్యవసాయరంగాన్ని గాలికి వదిలేసింది. గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలు రూ.24,439 కోట్లు ఉంటే, ఈసారి దానిని రూ.23,179 కోట్లకు తగ్గించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు పెట్టారు.
ఎస్సీ సంక్షేమానికి గత బడ్జెట్లో రూ.40,234 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.11,784 కోట్లకే పరిమితం చేశారు. దాదాపు 70% మేర కేటాయింపుల్లో కోత పెట్టారు. గిరిజన సంక్షేమానికి గతంలో రూ.17,169 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.7,937 కోట్లతో సరిపెట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, పరిశ్రమల శాఖకు కేటాయింపులను రూ.3,527 కోట్ల నుంచి రూ.3,490 కోట్లకు తగ్గించింది. ఆత్మహత్యల అంచున ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడంలోనూ విఫలమైంది. గతంలో ఉన్న రూ.371 కోట్ల బడ్జెట్ను రూ.258 కోట్లకు కుదించి చేనేత రంగాన్ని నిరాశపరిచింది. బడ్జెట్ అంచనాలు పెరిగినా, ప్రాధాన్యం గల రంగాలకు నిధులు తగ్గించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆర్థిక నిఫుణులు చెప్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో అసలైన అభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం పకన పెట్టిందనే విమర్శిస్తున్నారు.
కీలక శాఖలకు కేటాయింపుల్లో కోతలు ఇలా (రూ.కోట్లలో)