Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్‌లోని ఒక ఇంటిని యజమాని అద్దెకు ఇచ్చాడు. నెలకు రూ.15 వేల కిరాయి. ప్రతి నెలా అద్దెకు ఉన్నాయన యజమానికి కిరాయి డబ్బులు ఇస్తున్నాడు. ఇట్ల కొన్ని ఏండ్లు కిరాయి కట్టిన తర్వాత ఆ ఇల్లు కిరాయికి ఉన్నాయనది అవుతుందా? ప్రభుత్వ రికార్డుల్లో యజమాని పేరు పోయి కిరాయికి ఉన్న వ్యక్తి పేరు వస్తుందా? అట్లెట్ల వస్తది? యజమాని యజమానే! కిరాయి వ్యక్తి కిరాయి వ్యక్తే!! కదా. కానీ, రైతు వ్యవసాయ భూమికి మాత్రం ఇది వర్తించదు. రైతు ఏవో కొన్ని కారణాల వల్ల తన భూమిని కౌలుకు ఇస్తే..
కౌలుదారు పేరు కూడా ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కుతుంది. ఇదెక్కడి అన్యాయం? రైతు అగ్గువకు దొరికిండా? బంజారాహిల్స్‌లో ఉండే ధనికులకు ఓ రూలు! దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతకు మాత్రం ఇంకో రూలా?అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతన్నకు న్యాయం చేశారు. రైతు నమ్ముకున్న భూమికి భద్రత కల్పించారు. నిన్నటిదాకా రాత్రికి రాత్రి తన భూమి ఎవరి పేరు మీదకు మారుతుందోనన్న భయంతో బతికిన రైతులు.. ధరణి వచ్చిన తర్వాత గుండె మీద చేయి వేసుకొని ప్రశాంతంగా పడుకుంటున్నారు.
కాంగ్రెసోళ్లకు ఇది నచ్చడం లేదు. భూమే తన సర్వస్వంగా భావిస్తున్న రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. పచ్చని పల్లెల్లో మళ్లీ ‘కౌలు’ చిచ్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు చట్టం తీసుకొస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతుకు-కౌలుదారుకు మధ్య ఒప్పందం చేయిస్తామని కుండబద్దలు కొట్టారు. అంటే గుంట భూమిని కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా భావించే రైతుల భూ యాజమాన్య హక్కుకే ఎసరు పెట్టేలా కాంగ్రెస్ పార్టీ ఉరితాడు పేనుతున్నదన్నమాట.
తెలంగాణలో సుమారు 1.55 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నది. దాదాపు 69 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న భూముల రికార్డులు, నిర్వహణను ప్రక్షాళన చేసిన తెలంగాణ ప్రభుత్వం ధరణితో వీటికి శాశ్వత రక్షణ కల్పించింది. ధరణి ఉండటం వల్లనే సాఫీగా రైతులకు రైతుబంధు అందుతున్నది. గతంలో వీఆర్వో మొదలు తాసిల్దార్ కార్యాలయం, కలెక్టరేట్, సీసీఎల్ఏ ఇలా అనేకచోట్ల ఉండే భూముల రికార్డులు ఏ రాత్రికి ఎక్కడ మారతాయో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ధరణి ద్వారా భూమి యజమాని అయిన రైతు వేలిముద్ర (బయోమెట్రిక్) పెడితే తప్ప బదలాయింపు సాధ్యం కాదు.
అందుకే రాష్ట్రంలో ఎక్కడా భూముల తగాదాలుగానీ, సరిహద్దు పంచాయితీలుగానీ మరీ ముఖ్యంగా తలకాయలు పగులగొట్టుకునే దృశ్యాలుగానీ లేవు. అయితే కొందరు రైతులు తమ పేరిట ఉన్న భూమి అంతా స్వయంగా సాగు చేయడం లేదు. కొందరు కౌలుకు ఇస్తున్నారు. రైతు-కౌలుదారు నోటి మాటగా ఒప్పందం చేసుకుంటున్నారు. పండిన పంటలోగానీ లేదా ఎకరానికి ఇంత అని గానీ మాట్లాడుకుంటున్నారు. దీనికీ ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధం ఉండదు. దీంతో ప్రస్తుతం ఎక్కడా ఎలాంటి గొడవలు లేకుండా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి.

కుంపటి పెడతామంటున్న కాంగ్రెస్
తాము అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు రైతాంగం గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక టీవీ చానెల్లో మాట్లాడుతూ… కౌలు చట్టం తీసుకొస్తామని చెప్పారు. అంటే రైతులు తమ భూమిని కౌలుకు ఇస్తే కచ్చితంగా అధికారికంగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పలానా రైతు భూమిని పలానా వ్యక్తి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడనేది అధికారిక రికార్డుల్లో నమోదవుతుంది. న్యాయపరంగా కౌలుదారుకు కొంత ఆధారం వచ్చినట్లవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తద్వారా రైతుకు కౌలుదారుకు మధ్య విబేధాలు తలెత్తుతాయి. అప్పటివరకు రైతులకు ఆ భూమి మీద ఉన్న యాజమాన్య హక్కుకు కౌలుదారు ఎసరు పెట్టి న్యాయస్థానంలో నిలబెట్టే పరిస్థితి నెలకొంటుంది. ఇలా ఒక గ్రామంలో పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు కావడం వల్ల ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పల్లెలు అల్లకల్లోలంగా మారతాయి. ఇలా కౌలు చట్టం తీసుకొచ్చి రైతుల పొలాల్లో కుంపట్లు పెడతామని కాంగ్రెస్ పార్టీనే స్వయంగా చెప్తుండటం కౌలు చట్టం ద్వారా రైతుకు ఉరితాడు పేనడం తప్ప మరోటి కాదు.
అనేక రూపాల్లో భారీ నష్టం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్న కౌలు చట్టంతో అధికారికంగా రైతులు-కౌలుదారు మధ్య ఒప్పందం జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా రైతు-కౌలుదారు పరస్పరం నోటి మాట ద్వారా సాగు చేయడమనేది ఉండదు. దీంతో తన యాజమాన్య హక్కుకే ఎసరు వస్తుందనే భయంతో ఏ ఒక్క రైతు కూడా తనకున్న భూమిని కౌలుకు ఇచ్చేందుకు ముందుకు రాడు. తనకు చేతనైతే సాగు చేస్తాడు. లేకపోతే ఆ భూమిని పడావు పెడతాడు. దీంతో ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నా.. వేల కోట్లు వెచ్చించి నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇస్తున్నా.. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్నా.. కౌలుదారుకు అధికారికంగా ఒప్పందం చేయాల్సి రావడంతో రైతు తన చేతనైనంత వరకే సాగు చేసి మిగిలిన భూమిని పడావు పెడతాడు. తద్వారా క్రమేణా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతుంది.
మరోవైపు కౌలు ఇచ్చేందుకు రైతులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కౌలుదారుకు ఉపాధి దొరకకుండా పోతుంది. ఇప్పుడు ప్రశాంతంగా కౌలు ద్వారా వ్యవసాయం చేసి ఆత్మగౌరవంతో బతుకుతున్న కౌలు రైతును కౌలు చట్టం ఆదుకోకపోగా అసలు వ్యవసాయానికే దూరం చేసి ఆ కుటుంబాన్ని వీధినపడేసే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న కౌలుచట్టం అనేక రూపాల్లో నష్టాన్ని తీసుకొచ్చి, గ్రామీణ వాతావరణాన్నే చిన్నాభిన్నం చేసే ముప్పు పొంచి ఉన్నది.
మళ్లీ దళారులకు భోజ్యం
కాంగ్రెస్ చెప్తున్నట్టు కౌలు చట్టం తీసుకొచ్చి రైతు-కౌలుదారు మధ్య అధికారిక ఒప్పందం చేయిస్తామంటే అసలు దీనిని నమోదు చేసే వ్యవస్థ ఏది? ప్రస్తుతానికైతే అలాంటి వ్యవస్థ లేదు. కౌలు చట్టం తెచ్చి మళ్లీ పాత రోజులు వస్తే.. గ్రామాల్లో కౌలు రైతుల పేర్లు నమోదు, ఒప్పందాల ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. ఎలాగూ కాంగ్రెస్ కౌలు రైతులకు కూడా ఏటా ఎకరానికి రూ.12 వేలు ఇస్తానంటున్నందున కేవలం ఆ మొత్తం కోసమే బోగస్ ఒప్పందాలు తెరపైకి వస్తాయి. ప్రభుత్వ సాయం అందుతున్నందున దీనిని సాకుగా చూపి రైతు, కౌలుదారు నుంచి ఎక్కువ మొత్తం కౌలు వసూలు చేయడంతో కౌలుదారు కూడా ఆర్థికంగా నష్టపోతాడు.
రైతుబంధుకు మంగళమేనా?
కాంగ్రెస్ తెస్తామంటున్న కౌలు చట్టం ద్వారా రైతులకు ఇప్పటివరకు అందజేస్తున్న రైతుబంధుకు కూడా ఎగనామం పెట్టే ప్రమాదం ఉన్నదని పలువురు హెచ్చరిస్తున్నారు.. ఉదాహరణకు.. ఒక రైతు తనకున్న రెండెకరాల భూమిని కౌలుకు ఇవ్వడం వల్ల కౌలు రైతుకు కాంగ్రెస్ ఇస్తానంటున్న ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున రూ.24 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తరుణంలో నిజమైన యజమాని అయిన రైతుకు కూడా ఏడాదికి రూ.30 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఒకే భూమిపై ఇద్దరికి ఎలా డబ్బులు ఇస్తుంది? ఇది సాధ్యం కానందున.. సాగు చేస్తున్న కౌలుదారుకు మాత్రమే డబ్బులు ఇచ్చి అసలు రైతుకు రైతుబంధును నిలిపివేసే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు రైతులు రైతుబంధు పొందుతూ.. కౌలు ద్వారా వచ్చే ఎంతో కొంత మొత్తాన్ని తీసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ చెప్తున్న కౌలు చట్టం వల్ల ఒకవైపు యాజమాన్య హక్కుకు ముప్పు రావడంతోపాటు మరోవైపు రైతుబంధుకే ఎసరు రావడంతో అనేక రకాలుగా రైతులు నష్టపోతారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏమైతది?