హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పైసలు ఇవ్వొద్దంటూ టీ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం.. ఎన్నికల సంఘం రైతుబంధును ఆపాలని ఆదేశాలివ్వడం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. రైతు నోటికాడ బువ్వను లాగేసిన కాంగ్రెస్ తీరుపై ప్రాంతాలకు అతీతంగా నిరసన వ్యక్తమవుతున్నది. ఎక్స్(ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక వేదికలపై కాంగ్రెస్ తీరును నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. 50 ఏండ్లకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రైతులకు ఏమీ చేయలేదని, ఇప్పుడు బీఆర్ఎస్ రైతుల కోసం మంచి చేస్తుంటే చూడలేకపోతుందని మండిపడుతున్నారు.
‘రైతుబంధును ఆపిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్.. రైతు వ్యతిరేక కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వస్తే గ్రామాల్లో అడుగు పెట్టనివ్వకండి.. మీ పవర్ ఏమిటో చూపించండి’ అంటూ సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. రాబందు కాంగ్రెస్ కావాలా? రైతుబంధు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? అని ఒక యువకుడు ట్వీట్ చేయగా.. కాంగ్రెస్‌ను కాటికి పంపుదాం.. బీఆర్ఎస్ను గెలిపించుకుందాం.. అని అనేక మంది రీట్వీట్ చేశారు.
పీఎం కిసాన్‌కు ఎన్నికల కోడ్ లేదని, మరి రైతుబంధుకు మాత్రం ఎందుకు అడ్డొస్తుందని నిలదీశారు. రైతుబంధును అడ్డుకోవడానికి అనేకసార్లు ఈసీకి ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్ పార్టీ.. పీఎం కిసాన్‌పై మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రైతులపై కాంగ్రెస్, బీజేపీ ఇద్దరిదీ దొంగ ప్రేమేనని మండిపడ్డారు. రైతు నోటికాడ బువ్వను లాగేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తామని, రైతుబాంధవుడు కేసీఆర్‌కు అండగా నిలుద్దామని పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు.