హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మీపై డ్రగ్స్ కేసు ఉన్నది.. ఢిల్లీకి రండి.. అంటూ ఉద్యోగాలు చేసే యువతులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కాల్స్ బారిన పడిన బాధితులు పలువురు లక్షలు ముట్టజెప్పారు. అయినా, వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా నెలలో మూడు కమిషనరేట్ల పరిధిలో 10 కేసులు నమోదయ్యాయి. సోషల్‌మీడియా, జాబ్ పోర్టళ్లు వంటి మార్గాల ద్వారా ఆధార్, పాన్ కార్డులతోసహా పలువురు డాటా సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్నారు. మేం కస్టమ్స్ అధికారులం, మా తనిఖీల్లో ఒక పార్సిల్ దొరికింది. దానిపై మీ పేరు, చిరునామా, ఫోన్ నం బర్ ఉన్నది. మీరు డ్రగ్స్ దందా చేస్తున్నారు.
ఈ విషయాన్ని మేం సీబీఐ వాళ్లకు అప్పగిస్తున్నామంటూ ఇంకో ఫోన్‌తో మాట్లాడుతారు. మేం సీబీఐ అధికారులం మీరు ఢిల్లీకి వచ్చి ఈ పార్సి ల్ విషయంలో మాకు తక్షణమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందంటూ బెదిరిస్తుంటారు. వివిధ మార్గాల్లో సేకరించిన ఆధార్, ఫొటో ఇతర వివరాలను బాధితులకు షేర్ చేస్తుంటా రు. దాంతో బాధితుల్లో భయం నెలకొంటుంది. మరొకరు ఫోన్‌చేసి ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఫలానా నంబర్‌కు కొంత మొత్తం డబ్బు పంపించాలని సూచిస్తుంటారు, కొన్నిసార్లు బ్యాంకు ఖాతా వివరాలతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు తీసుకొని డబ్బులు సైతం కాజేస్తున్నారు. ఇది ఎక్కడ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో కొందరు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించారు. ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ చీటర్ల బెదిరింపులకు భయపడకుండాపోలీసులను ఆశ్రయించాలని రాచకొండ సైబర్‌క్రైమ్స్ డీసీపీ అనూరాధ సూచించారు. బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడి డబ్బు డిపాజిట్ చేయవద్దని తెలిపారు.