హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూలో పీహెచ్డీ అడ్మిషన్లపై సందిగ్ధం నెలకొన్నది. ప్రవేశాల ప్రక్రియ ఎప్పట్లోగా పూర్తి చేస్తారన్న విద్యార్థుల ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పూర్తవుతాయో లేదో చెప్పాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జేఎన్టీయూలో పీహెచ్డీ అడ్మిషన్ల కోసం వర్సిటీ అధికారులు మేలో నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో అర్హత పరీక్ష నిర్వహించి, ఫలితాలు విడుదల చేశారు.
అనంతరం జరగాల్సిన ప్రక్రియ కొనసాగడంలేదు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం షెడ్యూల్ ప్రకటించారు. కానీ షెడ్యూల్ను రద్దు చేస్తూ.. మరో నోటిఫికేషన్ విడుదల చేయగా, పీహెచ్డీ అడ్మిషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఎప్పుడో.. అడ్మిషన్లు కల్పించేది ఎప్పుడో తెలియని అయోమయంలో విద్యార్థులు ఉన్నారు. అడ్మిషన్ల అర్హత పరీక్షకు దా దాపు 2,000 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో దాదాపు 700 వరకు అర్హత సాధించారు. వీలైనంత త్వరగా అడ్మిషన్లు పూర్తి చేస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. కానీ త్వరలో అంటే ఎప్పుడో అర్థం కావడంలేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.