హైదరాబాద్ : రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ నెల 12న భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను మంత్రి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ అంశమే ప్రస్తావనకు రానప్పుడు.. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి ఉద్దేశపూర్వకంగా చేసినవేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తుండడంతో వణికిపోయిన మోదీ.. రాజ్యసభలో ఆ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు నిలదిస్తారనే అభద్రతతో ఓటర్లకు మొహం చూపలేక.. సొంత రాష్ట్రం గుజరాత్, యూపీల్లో ఉచిత విద్యుత్ అడుగుతారన్న సంశయంతో మోదీ.. తెలంగాణపై విషం చిందారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని, వేరు పడి బాగుపడ్డ రాష్ట్రం అని.. అటువంటి రాష్ట్రం నుంచి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ అభివృద్ధిలో దేశానికి కొత్త నమూనా అందిస్తుంటే.. అది తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న సంశయంతో మోదీ కొత్త కుట్రలకు తెరలేపారని విమర్శించారు. కేసీఆర్ పాలనను రోల్ మోడల్‌గా వర్ణించిన నోటితో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ మండిపడ్డారు.