Gurukula Posts | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): గురుకులాల పోస్టుల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడే అవకాశం ఉన్నా, మరోవైపు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. తన పంతాన్నే నెగ్గించుకునేందుకు ముందుకు సాగుతున్నది. సొంత పేరు కోసం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తన హయాంలో భర్తీ చేసే కలరింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నది. రీలింక్విష్మెంట్ విధానం లేకుండానే గురుకుల పోస్టులన్నీ భర్తీ చేసేందుకే సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అనుమతి పొందినా భర్తీచేయని పోస్టులతోపాటు, తాజా భర్తీలో బ్యాక్‌లాగ్‌గా పోస్టులన్నింటినీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల డిమాండ్‌పై సర్కారు మౌనం వహిస్తున్నదని విద్యావేత్తలు తేల్చి చెప్తున్నారు. అదీగాక ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతోనే ఆయా సొసైటీలు ట్రిబ్ కొత్తగా అలాట్ చేసిన అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 క్యాటగిరీల్లో పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులు కలిపి మొత్తంగా 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) చేపట్టింది. ఇప్పటికే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు మినహా మిగిలిన అన్ని పోస్టులకు సంబంధించి 1:1 జాబితాలను సైతం ప్రకటించింది. గత ఫిబ్రవరిలోనే ఆయా అభ్యర్థులను సొసైటీల వారీగా కేటాయిస్తూ ఎల్బీ స్టేడియం వేదికగా అలాట్మెంట్ ఆర్డర్లను అందజేసింది. దీనిపై 1:2 జాబితాలోని అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రీలిక్విష్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని పలువురు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు.
రీలింక్విష్మెంట్ విధానం అంటే..
రీలింక్విష్మెంట్ విధానం అంటే.. గురుకులాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నిర్ణీతకాలం వరకు ఉద్యోగాన్ని వదిలిపోబోమని, ఒకవేళ అదే జరిగితే ఆ ఉద్యోగాన్ని మెరిట్ జాబితాలో ఉన్న తర్వాతి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒప్పందపత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. ఆ మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేయాలి. ఫలితంగా ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్‌లాగ్‌కు వెళ్లే అవకాశం ఉండదు. కానీ ప్రస్తుతం ట్రిబ్ ఆ విధానాన్ని అమలు చేయకుండానే పోస్టుల భర్తీని చేపట్టడమే అసలు వివాదానికి తావిస్తున్నది. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్టింగులు ఇచ్చేందుకు ఆయా సొసైటీలు కసరత్తు చేస్తుండటం అందుకు బలాన్ని చేకూరుస్తున్నది.
బ్యాక్లాగ్ పోస్టులన్నీ కొత్త నోటిఫికేషన్ ద్వారానే..
ప్రస్తుత నియామకాల్లో మిగిలే పోస్టులన్నింటినీ తర్వాత కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నదని విద్యావేత్తలు, పలువురు గురుకుల అభ్యర్థులు నొక్కి చెప్తున్నారు. ప్రస్తుతం నోటిఫై చేసిన 9,210 పోస్టుల్లో ఇప్పటివరకు 8,708 పోస్టుల ఎంపిక ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. అందులో కూడా 8,304 పోస్టులనే ట్రిబ్ భర్తీ చేసింది. 404 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని చెప్పి భర్తీ చేయలేదు. అదీగాక రీలింక్విష్మెంట్ విధానం లేకపోవడం, కామన్ పేపర్ పెట్టడం, డిసెండింగ్ ఆర్డర్‌ను అంటే పైనుంచి కిందికి వరుస క్రమంలో నింపకపోవడం వల్ల ప్రస్తుతం భర్తీ చేసిన పోస్టుల్లోనూ దాదాపు 1,500 నుంచి 2,000 పోస్టుల వరకు బ్యాక్‌లాగ్‌లో పడిపోయే అవకాశం ఉన్నది. దీనిని ఒకే అభ్యర్థి వివిధ క్యాడర్ పోస్టులకు ఎంపిక కావడమే కారణమని అభ్యర్థులు వివరిస్తున్నారు.
మంజూరై భర్తీకాని పోస్టులూ కొత్త నోటిఫికేషన్లోనే..
బ్యాక్లాగ్ పోస్టులతోపాటు గురుకులంలో మంజూరై భర్తీచేయని పోస్టులు కూడా ఉన్నాయి. వాస్తవంగా అన్ని గురుకులాల కోసం ప్రభుత్వం తొలుత 11,687 పోస్టులను మంజూరు చేసింది. అందులో 10,675 పోస్టులు బోధన సిబ్బంది కాగా, మిగిలినవి 1,012 బోధనేతర పోస్టులు ఉన్నాయి. బోధన సిబ్బంది పోస్టులను ట్రిబ్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టింది. మొత్తంగా 10,675 పోస్టులను భర్తీచేయాల్సి ఉండగా, అందులో తొలిదఫాగా 9,210 పోస్టుల భర్తీకి మాత్రమే ట్రిబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. సర్వీస్ రూల్స్, న్యాయ వివాదాల్లో ఉన్న 1,465 పోస్టుల భర్తీని రెండో విడతలో చేపట్టాలని గతంలోనే నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న ఈ 1,465 పోస్టులనూ బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసి తమ ఖాతాలో వేసుకోవాలనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు విద్యావేత్తలే చెప్తున్నారు. ట్రిబ్ సైతం నోటిఫికేషన్‌లోని పేరా 5(1)లో జీవో 81, 1997 ప్రకారం వెయిటింగ్ లిస్టు విధానం లేదని, భర్తీ కాని, అభ్యర్థులు జాయినింగ్ కాని ఖాళీలను క్యారిఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని ఇప్పటికే ఒకసారి ప్రతికా ముఖంగానే తేల్చిచెప్పింది.
అభ్యర్థుల డిమాండ్‌పై సర్కారు మౌనం
ట్రిబ్ డిసెండింగ్ ఆర్డర్‌ను పాటించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, రీలింక్విష్మెంట్ విధానాన్ని అమలుచేస్తే బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే అవకాశం ఉండబోవని 1:2 జాబితాలోని అభ్యర్థులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాజకీయాల కోసం తమ భవితవ్యాన్ని ప్రభుత్వం పణంగా పెడుతున్నదని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదే విషయమై పలువురు గురుకుల అభ్యర్థులు గతంలో ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించుకున్నారు. ఆ సమయంలోనే సమస్య పరిష్కారానికి మంత్రి పొన్నం నేతృత్వంలో సబ్‌కమిటీ వేస్తామని హామీ ఇచ్చారని, మూడు నెలలు గడిచినా ఆ ఊసే లేకుండా పోయిందని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. రీలింక్విష్మెంట్ విధానం, రెండో జాబితాను ప్రకటించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం మౌనం వహిస్తుండడం సైతం అభ్యర్థుల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు.