హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చె ల్లింపుపై సర్కారులో కదలిక వచ్చింది. రెండు రోజుల్లోగా బిల్లులు చెల్లించనున్నట్టు తెలుస్తున్నది. బిల్లులను చెల్లిస్తామంటూ ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను ఒకేసారి కాకుండా ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, ఆగస్టులో కొన్ని బిల్లులను జమ చేసింది. సెప్టెంబర్ బిల్లులను జమచేయలేదు. ఇదే విషయంపై ‘ఈ నెల 700 కోట్లు డౌటే” శీర్షికతో సోమవారం నమస్తే తెలంగాణ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్ర చురించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి సోమవారం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో సచివాలయంలో భేటీ అయ్యారు. రెండు రోజుల్లోగా బిల్లులు చెల్లిస్తామని సందీప్‌కుమార్ సుల్తానియా హామీ ఇచ్చినట్టు దామోదర్‌రెడ్డి తెలిపారు.