MLA Kaushik Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడి వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి ఆదేశాల మేరకే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్యే గాంధీ నివాసం వివేకానందనగర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి మధ్యలో 8 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నాయి. కానీ.. ఎక్కడా 20 వాహనాల ఆ కాన్వాయ్ ఆగలేదు.. పోలీసులూ అడ్డుకోలేదు. గేటెడ్ కమ్యూనిటీలోకి వాహనాలు చొచ్చుకొస్తున్నా, ప్రధాన గేటుపైకి ఎక్కి, తన్నుకుంటూ వీరంగం సృష్టించినా, రాళ్లు విసిరినా పోలీసులు పెద్దగా అడ్డుకున్నట్టు కనిపించలేదు.
2గంటల బీభత్సాన్ని సృష్టించినా పోలీసులు స్పందించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం దాడి వెనుక ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారుల హస్తం ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘వాళ్లను అడ్డుకోవద్దు’ అని ఆదేశాలు ఇవ్వడం వల్లే కాన్వాయ్ 20 నిమిషాల్లోనే కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరిందని అంటున్నారు. ఆ ఆదేశాలు ఎవరు ఇచ్చారన్న చర్చ పెద్దఎత్తున జరుగుతున్నది. దాడిపై ముందుగానే సమాచారమున్నా ఇంటెలిజెన్స్ వర్గాలు గప్‌చుప్‌గా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.