Paddy Procurement | నమస్తే నెట్వర్క్, మే 2 : ‘చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రంలో పోసినం. కాంటా వెయ్యమంటే రేపు మాపు అంటున్నరు. 25 రోజులైనా పట్టించుకునేటోళ్లు లేరు. రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నం. గన్నీ బ్యాగులు లేవని, లారీలు వస్తలేవని సాకులు చెప్తున్నరు. వర్షమొస్తే కప్పడానికి టార్పాలిన్లు లేవు. అష్టకష్టాలు పడి పంట పండిస్తే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు. ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులు?’ అంటూ రైతులు మండిపడుతున్నారు. సహనం కోల్పోతున్న రైతులు రోడ్డుపై ధర్నా, రాస్తారోకోలు చేస్తున్నారు. శుక్రవారం కూడా చాలాచోట్ల రైతులు రోడ్డెక్కారు.
ఓపిక నశించి ధాన్యం తగలబెట్ట్టే ప్రయత్నం
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతు అంకం నాగయ్య 25 రోజుల క్రితం ధాన్యం పోశాడు. ఐదు రోజుల క్రితం తేమ శాతం చూసి 13 ఉన్నదని తెలిపారు. ఎండబెట్టిన వడ్లకు తేమ శాతం వచ్చినా కాంటా పెట్టలేదు. వర్షం వచ్చే అవకాశం ఉండటంతో రోజూ వడ్లపై టార్పాలిన్ కప్పుతున్నాడు. ఓపిక నశించడంతో రైతు నాగయ్య కుమారుడు రామకృష్ణ శుక్రవారం కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం కుప్పపై శానిటైజర్ పోసి తగలబెట్టేందుకు యత్నించగా తోటి రైతులు అడ్డుకున్నారు. కొందరు రైతుల వద్ద డబ్బులు తీసుకొని, తేమ శాతం లేకపోయినా కాంటాలు పెడుతున్నారని సదరు రైతు వాపోయాడు.
15 రోజులైనా దిక్కులేదు..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన రైతు బానోత్ చంద్రు 15 రోజుల క్రితం బయ్యారంలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కాంటా పెడ్తలేరు. తేమ శాతం అంటూ కొన్ని రోజులు, రేపుమాపు అంటూ 15 రోజులుగా కాలయాపన చేశారని రైతు మండిపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యంపై టార్పాలిన్లు కప్పి కాపాడే ప్రయత్నం చేసినా తడిసిపోయిందని వాపోయాడు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందని అసహనం వ్యక్తంచేశాడు. కొనుగోలు కేంద్రంలో అనేక మంది రైతులు తడిసిన ధాన్యాన్ని చూసి దుఃఖంలో మునిగిపోయారు. కాంటా వేస్తలేరని సూర్యాపేట మండలం రాజానాయక్ తండాలో ఐకేపీ సెంటర్ వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట – జనగామ రహదారి టోల్గేట్ వద్ద సుమారు గంట సేపు రోడ్డుపై బైఠాయించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లో ఐదు రోజులకు ఒక్క లారీ వస్తున్నదని, ధాన్యం కాంటా వేయకపోవడంతో పశువులు ధాన్యాన్ని మేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నామని, వెంటనే ధాన్యం కొనుగోలు చేస్తే సమస్య ఉండదని తెలిపారు. రహదారిపై ధర్నా చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ధాన్యం కొంటలేరని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి బస్టాండ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోపాటు క్వింటాకు 10 కిలోలు తరుగు తీస్తున్నారని మండిపడుతూ ధర్నాకు దిగారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని, మరికొంత కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయమని వాపోయారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నా.. సర్కారు కొనుగోలు వేగవంతం చేయడం లేదని మండిపడ్డారు.
జొన్న కొనుగోళ్లలోనూ జాప్యమే…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డు లో జొన్న పంటను విక్రయించేందుకు మండుటెండలో రైతన్నలు ముప్పుతిప్పలు పడుతున్నారు. అధికారులు ముందుగా సూచించిన విధంగా రైతులు మార్కెట్‌యార్డుకు ఒకరోజు ముందు సాయంత్రం తీసుకువస్తున్నారు. రాత్రి మార్కెట్‌యార్డులో పంటకు కాపలా ఉంటున్నారు. మరుసటి రోజు కొనాల్సి ఉన్నా జాప్యం జరుగుతున్నది. పంటను పరిశీలించి పాసింగ్కు రాయాలంటూ రైతులు పీఏసీఎస్ సిబ్బంది వెంట తిరుగుతున్నారు. సిబ్బంది వచ్చి పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని పడిగాపులుకాస్తున్నారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు.
పంటను కాపాడుకునేందుకు పడిగాపులు
ఆదిలాబాద్‌లోని మార్కెట్‌యార్డులో రైతులు జొన్నలను విక్రయించేందుకు మండుటెండలో తిప్పలు పడుతున్నారు. అధికారులు చెప్పినట్టుగానే ఒకరోజు ముందుగా ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చినా నిరీక్షించాల్సి వస్తున్నది. ధాన్యాన్ని పరిశీలించి, పాసింగ్కు రాయాలంటూ రైతులు పీఏసీఎస్ సిబ్బంది వెంట తిరగాల్సి వస్తున్నది. రకరకాల సాకులు చెప్తూ వారు తిప్పలు పెడుతున్నారని, ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు అకాలవర్షాల కారణంగా పంట నష్టపోకుండా ఉండేందుకు ధాన్యం దగ్గరే పడిగాపులు కాస్తూ.. కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. భోజనం కూడా అక్కడికే తెప్పించుకుని తింటున్నారు. ఎదురుచూసి అలసిపోయి, అక్కడే నిద్రిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, త్వరగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్l
ధాన్యం కొనండి మహాప్రభో
ప్రభుత్వం మార్కెట్లు, ఐకేపీ కేంద్రాల్లో సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడంలేదు. దీంతో రైతులు రైస్‌మిల్లులను ఆశ్రయిస్తున్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం కడంపల్లి, నాచారం శివారులో ఓ రైస్ మిల్ వద్ద ధాన్యం లోడుతో వాహనాలు బారులుతీరాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.