Cheyutha Pension | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ) : ఆసరా పింఛన్‌దారులకు ఈ ఏడాది కూడా రేవంత్‌రెడ్డి సర్కారు మొండిచెయ్యి చూపింది. పింఛన్ల మొత్తం పెంపునకు మంగళం పాడింది. తాము అధికారంలోకి వస్తే రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలకు, రూ.4 వేల దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఎన్నికల ముందు ప్రతిసభలోనూ రేవంత్‌రెడ్డి ఇదే విషయం నొక్కి చెప్పారు.
కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా పింఛన్ల పెంపు ఊసెత్తడం లేదు. చేయూత పథకానికి సర్కారు ఈ బడ్జెట్లో రూ.14,861 కోట్లు మాత్రమే కేటాయించింది. గత 2024-25 బడ్జెట్లోనూ ఇంతే మొత్తం కేటాయించింది. ఇప్పుడు రూపాయి కూడా అదనంగా పెంచలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచితే సుమారు రూ.27,000 కోట్లు అవసరం. కానీ, సర్కారు మాత్రం పాత పద్దునే కేటాయించింది. మరోవైపు 10 లక్షల మంది కొత్త పింఛనుదారులకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు.