హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ 1:3 జాబితాపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం జరుగుతున్నదంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి క్యూ కట్టారు. పలు జిల్లాల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఒక జిల్లాలో రెండు పోస్టులుంటే 1 : 3 జాబితాలో ఇద్దరు నాన్‌లోకల్ అభ్యర్థులకు చోటు కల్పించాలని, స్థానికులం తామేం కావాలని ఓ అభ్యర్థి వాపోయాడు.
ఇక స్పోర్ట్స్ రిజర్వేషన్లో హైకోర్టు తీర్పు అమల్లో భాగంగా స్టేట్, జిల్లాస్థాయిలో పాల్గొన్నవారి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను చేపట్టలేదని మరో అభ్యర్థి పేర్కొన్నాడు. కాగా, డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నేపథ్యంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) రెండో సంవత్సరం ఫలితాలను అధికారులు విడుదల చేశారు. డీఎడ్ రెండో సంవత్సరం విద్యార్థులను సైతం డీఎస్సీ రాసుకునే అవకాశం కల్పించారు.