హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ‘యంగ్‌ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది. ఈ వర్సిటీ ఓ ఫ్లాప్‌షోగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీ వెబ్సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు వెయ్యి మందికి శిక్షణ ఇచ్చినట్టు స్పష్టమవుతున్నది. ఇందులో స్విగ్గీ, జొమాటో డెలివరీబాయ్స్గా శిక్షణ పొందినవారు 300 మంది ఉన్నారు. దీంతో స్కిల్వర్సిటీ.. డెలివరీబాయ్స్ను తయారుచేసే సంస్థగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండేండ్లలో స్కిల్వర్సిటీ కోసం సర్కార్ రూ.188 కోట్లు ఖర్చుచేసింది. ఇంతవరకు శిక్షణ పొందిన వారి సంఖ్య వెయ్యిలోపే. అంటే ఒక్కో విద్యార్థిని ప్రయోజకులను చేసేందుకు రూ.18.87 లక్షలు ఖర్చుచేసిందా? అన్న సెటైర్లు పేలుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రారంభించిన టాస్క్ ద్వారా .37 లక్షల మంది, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నెలకొల్పిన టీ-హబ్, వీ-హబ్ ద్వారా వేలాది మంది ప్రయోజనం పొందారు. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి సంస్థలను పక్కనపెట్టి సొంత డబ్బా కోసం స్కిల్ యూనివర్సిటీ పేరిట యువతను మోసం చేసిందని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ క్యాం పస్ ఏర్పాటు కావాల్సి ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి సదరు క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే, యూనివర్సిటీ కోసం అదానీ కంపెనీ నుంచి రూ.వంద కోట్ల విరాళం స్వీకరించడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ అధిష్ఠానం మొట్టికాయలేయడంతో రూ.వంద కోట్ల విరాళాన్ని వెనక్కి ఇచ్చేశారు. మేఘా కంపెనీ రూ.200 కోట్ల విరాళం ప్రకటించింది. అయితే, క్యాంపస్ నిర్మాణం నత్తనడకనసాగుతున్నది. తొలుత గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. ఎనిమిది నెలలు గడువకముందే అక్కడి నుంచి ఖాళీ చేసి, గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు తరలించారు. వర్సిటీలో ఇప్పటివరకు స్కూల్ ఆఫ్ అప్లయిడ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఏవియేషన్, స్కూల్ ఆఫ్ హెల్త్‌కేర్ విభాగాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. స్కూల్ ఆఫ్ స్కిల్స్, స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్, స్కూల్ ఆఫ్ ఫ్యాషన్డిజైన్, స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ అంత్రప్రెన్యూర్‌షిప్ డిపార్ట్మెంట్లు ఏర్పాటు కావాల్సి ఉన్నది.
స్కిల్వర్సిటీ ప్రభ రోజురోజుకు తగ్గుతున్నది. విద్యార్థులు ఈ వర్సిటీలో అంతగా చేరడంలేదు. నిజానికి శిక్షణ బాగుంటే డిమాండ్ ఉండాలి. విద్యార్థులు క్యూకట్టాలి. కానీ, మొదటి బ్యాచ్‌తో పోల్చితే రెండో బ్యాచ్‌లో విద్యార్థుల సంఖ్య తగ్గడం గమనార్హం. లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ కోర్సు తొలి బ్యాచ్‌లో 25 మంది విద్యార్థులు చేరితే, రెండో బ్యాచ్‌కు వచ్చేసరికి 13కు దిగజారింది. ఎండోస్కోపీ టెక్నీషియన్ తొలి బ్యాచ్‌లో 21 మంది చేరితే, రెండో బ్యాచ్‌లో 15 మంది మాత్రమే చేరారు. మరో కోర్సులో తొలి బ్యాచ్‌లో 24 మంది చేరితే, రెం డో బ్యాచ్‌లో సగానికి తగ్గి 14కు చేరింది.
స్కిల్ ఇండియా యూనివర్సిటీ ఇస్తున్న శిక్షణ ప్రత్యేకించి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకే పరిమితమైంది. అది కూడా సీఎం, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నియోజకవర్గాలకే. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో 180 మంది, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో 60 మందికి శిక్షణనిచ్చారు. మిగతా నియోజకవర్గాలు శిక్షణకు నోచుకోకపోవడం గమనార్హం.
స్కిల్ యూనివర్సిటీ సొంతంగా నిర్వహిస్తున్న కోర్సుల సంఖ్య చాలా తక్కువ. ప్రైవేట్ శిక్షణాసంస్థలు, విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకుని, ఆయా సంస్థల్లోని కోర్సులను యూ నివర్సిటీ పేరు మీద ఆఫర్ చేస్తున్నది. పాత వాటికే కలరింగ్ ఇస్తున్నది. టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, పవర్‌మెక్, ఏఐజీ హాస్పిటల్స్, నవత ట్రా న్స్పోర్ట్, బయోలాజికల్-ఈ వంటి సంస్థలు నిర్వహిస్తున్న కోర్సులనే వర్సిటీ వెబ్సైట్లో పెట్టి, కొత్త కోర్సుల పేరిట శిక్షణ ఇస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
స్కిల్ యూనివర్సిటీ ప్రస్తుతం పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్నది. దీంతో విద్యాపరమైన సమన్వయం సమస్య తలెత్తుత్తున్నది. అంతేకాకుండా యూజీసీ, ఏఐసీటీఈ వంటి సంస్థల నుంచి వచ్చే లేఖలు, సమాచారం ఈ వర్సిటీకి అందడంలేదు. మిగతా వర్సిటీలన్నీ విద్యాశాఖ ఆధీనంలో ఉంటే, ఈ ఒక్క వర్సిటీ మాత్రమే పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్నది. అయితే ఈ వర్సిటీని విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రతిపాదన సర్కార్ పరిశీలనలో ఉండగా, కార్యరూపం దాల్చడంలేదు.