హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో అత్యున్నతస్థాయి అధికారి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. సదరు అధికారి సహచరుల మీద నోటి దురుసు ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఈడియట్.. పండబెట్టి తొక్కుతా.. నీ మొఖం చేసినవ్’ అంటూ బూతులు తిడుతున్నారని, దిగువ స్థాయి అధికారుల వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన చాంబర్లోకి వెళ్లాలంటేనే పులిబోనులోకి వెళ్లినట్టుగా గజగజ వణుకుతున్నారని అంటున్నారు. ఆయన ధాటికి తట్టుకోలేక ఇప్పటికే ఇద్దరు ఉన్నతాధికారులు కూర్చున్న చోటనే గుండెపోటుతో పడిపోయినట్టు సమాచారం. గురువారం అర్ధరాత్రి మరో ఉన్నతాధికారి కుప్పకూలిపోయారట. సహచర అధికారులు, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఆయన్ను హుటాహుటిన ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్టు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నోడల్ డీసీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లను పిలిపించారు.
రెండు రోజుల నుంచి రాత్రీపగలు బదిలీల కసరత్తు మీదనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ సీనియర్ అధికారి రిపోర్ట్స్ తయారు చేసుకొని సదరు ఉన్నతాధికారి వద్దకు వెళ్లినట్టు తెలిసింది. ఆ రిపోర్టులో ఏ లోపం కనిపించిందో ఏమోగానీ ‘ఈడియట్’ అని సంబోధిస్తూ ఒంటికాలు మీద లేచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాము కూడా సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన వాళ్లమే అనే విషయం మరచిపోతున్నారంటూ బాధ్యతలు గుర్తుచేసే ప్రయత్నం చేసినట్టు చెప్తున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన అత్యున్నత అధికారి తన హోదాను మరచిపోయి నోరు పారేసుకున్నట్టు చర్చ జరుగుతున్నది. దీంతో సీనియర్ అధికారి మానసిక ఆందోళన చెంది బయటికి వచ్చి జాయింట్ కమిషనర్ చాంబర్లో కుప్పకూలినట్టు సమాచారం. సహచర అధికారులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేశారని, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల సహాయంతో కారులో ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారని తెలిసింది. ఒకరోజు ట్రీట్మెంట్ తరువాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఆయన దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాంలో చివరి రౌండ్ వరకు వెళ్లిన ఆధికారి కావటం గమనార్హం.
రెండు నెలల కిందటే ఒకరికి
రెండు నెలల కింద టీజీబీసీఎల్ ఉన్నతాధికారి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నట్టు తెలిసింది. నివేదికలు పట్టుకొని వెళ్లిన ఆయనపై సదరు అధికారి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డట్టు తెలిసింది. దీంతో చాంబర్లో కుప్పకూలినట్టు సమాచారం. ఆయనను హుటాహుటిన దవాఖానకు తరలించగా గుండెపోటుగా నిర్ధారించారట. ఉత్తర తెలంగాణ జిల్లాకే చెందిన మరో డిప్యూటీ కమిషనర్‌కు గతంలో సహచర అధికారుల ముందే ఇదే తరహా అవమానం ఎదురైనట్టు తెలిసింది. అందరిముందే లేపి నిలబెట్టి ‘పండబెట్టి తొక్కుతా’ అంటూ నోటికొచ్చినట్టు తిట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో సదరు అధికారికి, ఆయన పనిచేస్తున్న జిల్లా కలెక్టర్‌కు మధ్య ఏవో శాఖాపరమైన విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సదరు అత్యున్నతస్థాయి అధికారి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. దీంతో ఊగిపోయిన ఆయన ‘పండబెట్టి బూటు కాలుతో తొక్కుతా’ అని బెదిరించినట్టు తెలిసింది. దీంతో సదరు అధికారి రాజీనామాకు సిద్ధపడగా సహచర అధికారులు వారించినట్టు తెలిసింది.
పెన్‌డౌన్‌కు సిద్ధపడిన ఎక్సైజ్ అధికారులు
అత్యున్నత అధికారి తీరుకు నిరసనగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు పెన్‌డౌన్ చేయాలని తొలుత నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందని, ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు తెలిసింది. శుక్రవారం హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల బదిలీ ఆర్డర్లు జారీఅయ్యాయి. సోమ, మంగళవారంలోపు జాయినింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత అధికారిపై శాఖ మంత్రితోపాటు, సీఎంకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.