NCRB | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): స్నేహం ముసుగులో కొందరు.. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ పేరుతో ఇంకొందరు, ప్రేమ ముసుగులో మరికొందరు, పెళ్లాడతానని మ రొకరు.. పేర్లు ఏమైతేనేం.. అంతిమంగా బలవుతున్నది మాత్రం అమ్మాయిలే. దేశంలో ప్రతిరోజూ దాదాపు 88 మహిళలు అత్యాచారానికి గురువుతుండడం ఆందోళన కలిగించడమే కాదు, కలవరపాటుకు గురిచేస్తున్నది. అత్యధికమంది మహిళలు అయినవారి చేతుల్లోనే లైంగికదాడికి గురవుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాటేస్తుంటే.. బయటకు చెప్పుకుంటే పరువుపోతుందని ళ్లు నొక్కేస్తున్నారు ఇంకొందరు. ఇల్లు మొదలు ఆఫీసు వరకు మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతున్నదని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా అత్యాచార కేసులు 96.6 శాతం నమోదయ్యాయి. 18-30 ఏండ్ల వారిపైనే అత్యధికంగా 21,063 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. మొత్తం 31,516 కేసుల్లో 31,982 మంది బాధితులు ఉన్నట్టు ఎన్సీఆర్బీ తెలిపింది.
తెలిసిన వారు.. బంధువులే అధికం!
మహిళలపై జరుగుతున్న లైంగికదాడి కేసులను పరిశీలిస్తే.. ఎక్కువగా తెలిసిన వారు, సహోద్యోగులు, యజమానులు, కుటుంబ సభ్యులు, బంధువులే వారిని నమ్మించి వంచిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. 2,324 మంది కుటుంబ సభ్యుల చేతుల్లో లైంగికదాడికి గురయ్యారంటే ఆవేదన కలగకమానదు. వీరందరూ తమంతతాము బయటకు వచ్చి ఫిర్యాదు చేసినవారు. ఫిర్యాదు చేయనివారి సంఖ్య ఇంతకుమించి ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో 1,062 మంది లైంగికదాడికి గురయ్యారు. 2022లో నమోదైన 31,516 అత్యాచార కేసుల్లో 14,582 కేసులు స్నేహం, ప్రేమ, పెండ్లి పేరిట జరిగాయి. 248 లైంగికదాడి, హత్య/సామూహిక లైంగికదాడి కేసులు నమోదైనట్టు ఎన్సీఆర్బీ తెలిపింది. ఇదే కేటగిరీలో పెండింగ్ కేసులు కలిపి మొత్తం 464 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో 2022 నాటికి లైంగికదాడి క్రైంరేట్ 96.6 శాతంగా నమోదైంది. లైంగికదాడి కేసుల్లో రాజస్థాన్ టాప్ ప్లేస్‌లో ఉంది.
తెలంగాణలో 523 మంది అరెస్టు
2022లో తెలంగాణలో 814 లైంగికదాడి కేసులు నమోదు కాగా, 523 మంది అరెస్టయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 812 మంది తెలిసినవారి చేతిలో అఘాయిత్యానికి గురయ్యారు. మిగతా రెండు కేసుల్లో నిందితులు గుర్తుతెలియనవారే. అత్యాచార బాధితులను గుర్తించేందుకు, వారిలో చైతన్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసు ‘విమెన్ సేఫ్టీ వింగ్’ను ఏర్పాటు చేసింది. మహిళల కోసమే షీటీమ్స్, భరోసా సెంటర్లు, హ్యూమన్ ట్రాఫికింగ్, పని ప్రదేశాల్లో వేధింపులు అరికట్టేందుకు ‘సాహస్’ వంటి వ్యవస్థలను విజయవంతంగా అమలు చేస్తున్నది. ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపుల వంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పోకిరీల ఆటకట్టిస్తున్నారు.
2022లో రాష్ర్టాల వారీగా నమోదైన లైంగికదాడి కేసులు
రాష్ట్రం కేసులు