బయ్యారం, ఆగస్టు 20: విద్యుత్తు అంతరాయంతో ఇబ్బంది పడిన గ్రామస్థులు స్వయంగా మరమ్మతులు చేసుకుని కరెంటు సరఫరాను పునరుద్ధరించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ ఫీడర్ పరిధిలోని చర్లపల్లి తండాలో షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్తు వైరు తెగిపోయింది. రామచంద్రాపురం పంచాయతీ పరిధిలోని పెంకుతండా, కేసీఆర్ కాలనీకి సోమవారం మధ్యాహ్నం 2 నుంచి ఏడు గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రామస్థులు గంటల తరబడి కరెంట్ కోసం ఎదురుచూస్తూ అవస్థలు పడ్డారు. జ్వరాల బారిన పడ్డవారు కరెంట్ లేక నరకయాతన అనుభవించారు. ఈ విషయాన్ని విద్యుత్తు సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా స్పందించలేదు. అరగంటలో వస్తామని రాత్రి వరకు రాలేదు. రాత్రి ఫోన్ చేస్తే తాము అందుబాటులో లేమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. చేసేదిలేక గ్రామంలోని యువకులు రామచంద్రాపురం సెంటర్లోని ట్రాన్స్ఫార్మర్ ప క్కన ఉన్న స్తంభం వద్ద జంపర్ తెగినట్టు గురి్ంతచారు. మరమ్మతులు చేసుకుంటామని విద్యుత్తు అధికారులకు చెప్పి ఎల్సీకి అనుమతితీసుకున్నారు. యువకులు స్తంభం ఎక్కి.. జంపర్ వేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడంతో సమస్య తీరింది. గంటల తరబడి కరెంటు లేక ఇబ్బందులు పడితే.. అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు అసహనం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పాలనలో నిరుడు వర్షాకాలంలో నల్లగొండ జిల్లాలో కరెంటు సమస్య తలెత్తితే వానను కూడా లెక్కచేయకుండా ఓ లైన్‌మన్ కరెంటు సరఫరాకు నడుంబిగించాడు. కింద ఏరులా నీరు పారుతున్నా లెక్కచేయకుండా కరెంటు స్తంభం ఎక్కి విద్యుత్తును పునరుద్ధరించిన చిత్రం.
వరంగల్‌చౌరస్తా, ఆగస్టు 20: వరంగల్ నగరంలోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విద్యుత్తు అంతరాయం మావన తప్పిదం వల్ల జరగలేదని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 19న కురిసిన వర్షం కారణంగా విద్యుత్తు లైన్‌పై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో దవాఖానకు కరెంటు సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. వెంటనే సిబ్బంది కొమ్మలను తొలగించి మరమ్మతులు చేసి దవాఖానకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించినట్టు ఎస్ఈ వివరించారు.