హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): పోలండ్ దేశానికి పంపిస్తామని చెప్పి.. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన యువకులను అక్రమం గా సెర్బియాకు తరలించి, నరకయాతనకు గురిచేసిన ఓ కన్సల్టెన్సీ బాగోతం వెలుగులోకి వచ్చింది. డాంకీ ప్రాసెస్ (గాడిదలపై ప్రయాణం)లో తమను సరిహద్దులు దాటించేందుకు ప్రయత్నించారని, అక్రమంగా ఇతర దేశంలో ఉన్న తాము చేసేది లేక అక్కడి పోలీసులకు లొంగిపోయి, క్షమాభిక్షతో స్వదేశానికి తిరిగి వచ్చామంటూ బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.
బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. రూ.3.5 లక్షలు చెల్లిస్తే పోలండ్ తీసుకెళ్లి, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ హైదరాబాద్కు చెందిన అబ్రాడ్ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ ప్రచారం చేసింది. వీళ్ల మాటలు నమ్మి న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సంకెట్ గ్రామానికి చెందిన ఎత్తిన సాయితేజతోపాటు నిజామాబాద్, హైదరాబాద్కు చెందిన దాదాపు 10 మంది డబ్బులు చెల్లించారు. అయితే, నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో మధ్యవర్తి సొక్కం భూమేశ్, కన్సల్టెన్సీ డైరెక్టర్లు మనీశ్ అవస్తి, శ్రావణ్ అలియాస్ అజార్, మీరాన్ అలీ అహ్మద్ మహమూద్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో కన్సల్టెన్సీ నిర్వాహకులు ఆన్ అరైవల్ వీసాపై యువకులను సెర్బియా పంపించారు. అందులో కొందరిని గాడిదలపై ఎక్కించి యూరప్ దేశాల సరిహద్దులు దాటించేందుకు ప్రయత్నించారు.
సెర్బియాలోని హోటల్లోనే చాలా రోజులపాటు ఉంచారు. అటువైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. వీసా గడువు ముగుస్తుండటంతో యువకులు అక్కడి అధికారులను సంప్రదించగా, 29 రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. దీనిపై కన్సల్టెన్సీ నిర్వాహకులను ప్రశ్నిస్తే స్పందించలేదు. దీంతో యువకులు కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి తిరిగి వచ్చేందుకు ఖర్చులకు డబ్బులు డిపాజిట్ చేయించుకొన్నారు. అనంతరం అతి కష్టం మీద ఇండియాకు తిరిగి వచ్చారు. కన్సల్టెన్సీ నిర్వాహకులపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.