Telangana | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమశాఖను స్వతంత్రశాఖగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటికీ ఆచరణలో కలగానే మిగిలింది. సిబ్బంది కొరతను సాకుగా చూపు తూ ఇప్పటికీ మహిళా సంక్షేమశాఖలోనే వికలాంగులశాఖను కొనసాగిస్తుండటంపై దివ్యా ంగుల నుంచి అసహనం వ్యక్తమవుతున్నది. సాంఘిక సంక్షేమశాఖలో భాగంగా ఉన్న వికలాంగుల సంక్షేమశాఖను 1983లో ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేశారు.
కొందరు ఉన్నతాధికారుల అత్యుత్సాహం వల్ల ఈ శాఖను మహిళా శిశు సంక్షేమశాఖలో విలీనం చేశారు. మహిళాశిశు సంక్షేమశాఖ అధికారులు తమశాఖ పథకాల అమలుపైనే శ్రద్ధ చూపుతున్నారు తప్ప, దివ్యాంగులను పట్టించుకోలేదనే వి మర్శలు ఉన్నాయి. దీంతో దివ్యాంగుల శాఖను స్వతంత్రశాఖగా ఏర్పాటు చేయాలని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 2022 డిసెంబర్2న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికలాంగుల శాఖ పేరు ను దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జండర్ల సాధికారత సంస్థగా నామకరణం చేసింది. అయినా ఇప్పటికీ ఆ ఉత్తర్వులు అమలు కాలేదు.
10.46 లక్షల మంది దివ్యాంగులకు ప్ర త్యేకశాఖ లేకపోవడంతో పలు పథకాలు, కా ర్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యా యం, సాధికారతశాఖ కిందనే ప్రత్యేక శాఖగా వికలాంగుల వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రతోపాటు పలు రాష్ర్టాలు కూడా ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేశాయి. అదే బాటలో తెలంగాణ కూడా ప్రత్యేకశాఖగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ ఇచ్చింది. కానీ ఆచరణలో పరిస్థితి మారలేదు.
దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జండర్ల సంక్షేమశాఖకు సమర్థవంతమైన సేవలందించడానికి జిల్లా స్థాయిలోనూ ప్రత్యేకంగా జిల్లా అధికారిని నియమించాల్సి ఉంది. క్యాడర్ స్ట్రెంత్‌ను పునఃపంపిణీ చేయడానికి ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉన్నా ఇప్పటికీ చేయలేదు. వాస్తవంగా జిల్లాకు ఒక అడిషనల్ డైరెక్టర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెంట్ మొత్తంగా ఐదుగురు సిబ్బంది, 33జిల్లాలకు కలిపి 165మంది కావాల్సి ఉంది. ఈ మేరకు పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. కానీ సిబ్బంది లేరనే సాకుతో దివ్యాంగులశాఖను యథావిధిగా మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోనే కొనసాగిస్తున్నారు.