హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌనరాగాలు ఎన్నినాళ్లో.. ’ ఇది పెండ్లి సందడిలో పాడుకునే పాట. కానీ, ఈసారి పెండ్లి కావలసిన జంటలు మాత్రం అందుకు విరుద్ధంగా ‘మాఘమాసం ఎప్పుడు పోతుందో..’ అంటూ విరహగీతాలు పాడుకుంటున్నాయి! పెండ్లిళ్ల మాసంగా పేరొందిన మాఘమాసం ముగిసే వరకూ ఈసారి ముహూర్తాలు లేవంటూ పండితులు బాంబ్ పేల్చడమే ఇందుకు కారణం. సాధారణంగా కార్తీకం, మార్గశిరంలో సగం వరకు, ఆ తర్వాత తిరిగి పుష్య, మాఘమాసాల్లో అనగా.. డిసెంబర్ 15 వరకు, తిరిగి జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి, మార్చి రెండో వారం వరకు కూడా పెండ్లి సందడి కొనసాగుతూ ఉంటుంది.
కానీ, ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. 2025 నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రమౌఢ్యమి ఉన్నదని, ఇది శుభకార్యాలకు మంచిది కాదని తెలంగాణ విద్వత్సభ నిర్ణయించింది. మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పంచాంగం కూడా శుక్రమౌఢ్యమి 2025 నవంబర్ 30న ప్రారంభమై, 2026 ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుందని పేర్కొన్నది. చాలా అరుదుగా మాఘమాసంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని పండితులు చెప్తున్నారు.
మౌఢ్యమిలోనే మాఘం!
విశ్వావసు నామ సంవత్సరంలో నవంబర్ 26 మార్గశిర శుద్ధ దశమి నుంచి 2026 ఫిబ్రవరి 17వ తేదీ మాఘ బహుళ అమావాస్య వరకు శుక్ర మౌఢ్యమి ఉండటంతో మాఘమాసం వెళ్లిపోతున్నది. దీంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. ఫాల్గుణ మాసంలో 2026 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 11వ తేదీలోపే కొన్ని ముహూర్తాలున్నాయి. మార్చి 19 తరువాత ఉగాది, శ్రీరామనవమి పండుగలు వెళ్లిన తర్వాత గానీ పెండ్లి ముహూర్తాలులేవు. తెలుగు సంవత్సరాల్లో అప్పుడప్పుడు శూన్య, అధికమాసాలు రావడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది.
మూఢాల్లో పెండ్లి వంటి శుభకార్యాలు చేయరు కనుక ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి కారణంగా మూఢం ముగిసేవరకు అంటే మాఘమాసం వెళ్లి పోయి, ఫాల్గుణ మాసం ఆరంభం వరకు కొత్తగా పెండ్లి చేసుకోవాలనుకునేవారు, ఇతర శుభకార్యాలు చేసుకోవాలనుకున్నవారు ఆగాల్సిందేనని పండితులు చెప్తున్నారు. నిశ్చితార్థాలు, పెండ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జరుపుకునేవారు మౌఢ్యమి ముగిసేవరకు వేచి ఉండకతప్పని పరిస్థితి ఏర్పడింది. రథసప్తమి, వసంతపంచమి, మాఘపౌర్ణమి వంటి తిథులు కూడా మూఢంలో కలిసిపోవడంతో గృహప్రవేశాలకు కూడా ప్రతికూలత ఏర్పడింది.
బిజినెస్ డల్!
మూఢం కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పడటంతో ఫంక్షన్‌హాల్స్, కల్యాణమండపాలు బోసిపోతున్నాయి. శుభకార్యాల మీద ఆధారపడ్డ పురోహితులు, డెకరేషన్, షామియానా, టెంట్ సామగ్రి నిర్వాహకులు, వంటమాస్టర్లు, బాజాభజంత్రీలు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు దాదాపు రెండున్నరనెలలపాటు ఉపాధికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. వీరికే కాకుండా చిరువ్యాపారులైన గ్రీటింగ్లెటర్స్, క్యాటరింగ్బాయ్స్, బ్యుటీషియన్స్, మెహిందీ ఆర్టిస్టుల ఉపాధి కూడా దెబ్బతింటున్నది. పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం కొత్తబట్టలు, బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లన్నీ మందగించాయి.
గత సంవత్సరం ఒక్క ఫిబ్రవరిలోనే హైదరాబాద్ నగరంలో సుమారుగా 20 వేల జంటలు ఒక్కటయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ చివరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సుమారు మూడు లక్షల పెండ్లిళ్లు జరిగినట్టు అంచనా. మరోవైపు, డిసెంబర్లో ఎన్నారైలు కూడా స్వదేశానికి వచ్చి వివాహం చేసుకుని తిరిగి వెళ్లిపోవడానికి షెడ్యూల్ తయారుచేసుకుంటారు. కానీ, ఈసారి ముహూర్తాలు లేకపోవడంతో ఎన్నారైలు తమ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అమెరికా లాంటి దేశాల్లో ఉన్న పరిస్థితుల్లో తాము వచ్చి వెళ్లాలన్నా కూడా కష్టమేనని, ముహూర్తాలు మళ్లీ మొదలయ్యేనాటికి పరిస్థితి కొంత సర్దుబాటు అవుతుందేమోనని ప్రవాస భారతీయ యువతీ యువకులు తల్లిదండ్రులు భావిస్తున్నారు.
మూడు నెలలపాటు కష్టమే
శుభకార్యాలు నిర్వహించాలంటే గురుబలం, శుక్రబలం బాగా ఉండాలి. కానీ, మౌఢ్యమి సమయంలో ఈ రెండు గ్రహాలు తమ బలాన్ని కోల్పోతాయి. అందుకే, శుభకార్యాలకు మౌఢ్యమి మంచిది కాదు. దేవాలయ ప్రతిష్ఠలు, ఉపనయనాలు, వివాహాలు, శంకుస్థాపన వంటి శుభకార్యాలు సహజంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ, ఫాల్గుణ, వైశాఖ మాసంలో ఆచరించాలన్నది శాస్త్రప్రమాణం. అయితే, ఈసారి మౌఢ్యమి రెండున్నర నెలలపాటు రావడంతో దాదాపు మూడు నెలలపాటు మాకు పనిలేదు. మౌఢ్యమి ఉన్నందున మంచిరోజులు వచ్చేవరకు ఏవో చిన్నచిన్న కార్యక్రమాలు తప్ప పెద్ద కార్యాల్లేవు. ఇది ఆర్థికంగా కొంచెం కష్టంగానే ఉంటుంది.
-నాగరాజశర్మ, పురోహితుడు, హైదరాబాద్
బేరాల్లేవ్.. ఇన్ని రోజులు ఎప్పుడూ లేదు
పెండ్లిళ్ల సీజన్ ఉంటేనే పూల వ్యాపారులకు సంపాదన. ముహూర్తాలు ఉంటేనే పూలకు డిమాండ్. అయ్యప్ప సీజన్లో గిరాకీ సాధారణ స్థాయిలో ఉంటుంది తప్ప.. పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఉన్నంత గిరాకీ ఉండదు. ఈసారి మూఢాలు మూడు నెలలు ఉన్నాయంటున్నారు. దీంతో పెండ్లిళ్లు, శుభకార్యాలు లేకపోవడంతో బేరాలు రావడం లేదు. చేతిలో పనిలేకపోతే పైసలు లేక మాకందరికీ ఇబ్బందే. ఎక్కడెక్కడినుంచో వచ్చి ఇక్కడ పూలు కొనుక్కొనిపోతారు. గత నెల నుంచే బేరాలు తగ్గిపోయాయి. ఏదో నామ్కేవాస్తే నడిపిస్తున్నం. డెకరేషన్లు కూడా లేవు. మూడు నెలల గ్యాప్ వస్తే ఎట్ల నడిపించాల్నో తెలుస్తలేదు.
-ఎండీ అజీజ్, పూలవ్యాపారి, గుడిమల్కాపూర్
మూడు నెలలు మెయింటెనెన్స్ కష్టమే
మూడు నెలల వరకు మంచిరోజులు లేవంటున్నారు. శుభకార్యాలు ఏమీ జరగవు. వ్యాపారం మొత్తం పడిపోతున్నది. టెంట్‌హౌస్ నడవడమే కష్టమవుతున్నది. ఫంక్షన్‌హాల్స్ ఈ మూడునెలలు ఖాళీగా ఉండాల్సిందే. ఈ సమయంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.60 వేలపైచిలుకు నష్టం వస్తుంది. మెయింటెనెన్స్ చార్జీలు కూడా రావు. మడిగల కిరాయి కట్టాలి. ఫంక్షన్హాల్లో పనిచేసేవాళ్లకు నెలజీతాలివ్వాలి. బిజినెస్ మీద తీసుకున్న లోన్ల ఈఎంఐలు కట్టాలి. కష్టంగానే ఉన్నది.
-ప్రవీణ్‌యాదవ్, ఫంక్షన్‌హాల్ యజమాని, హైదరాబాద్