హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ యాసంగిలో లోయర్ మానేర్ డ్యాం (ఎల్ఎండీ) దిగువ ఆయకట్టుకు సాగునీటిని ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. భవిష్యత్తు తాగునీటి అవసరాలు, ఎల్ఎండీ ఎగువన సాగునీటి అవసరాలకు మాత్రమే ప్రస్తుతం నీటి నిల్వలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో దిగువకు ఇవ్వలేమని చెప్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఎస్సారెస్పీ స్టేజీ 2 ఆయకట్టుకు యాసంగిలో నీళ్లు అందే పరిస్థితి ప్రశ్నార్థకంగానే మారుతున్నది. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ స్టేజీ 1, స్టేజీ 2 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందాలంటే ప్రస్తుతం పది వేల ఎకరాల చొప్పున కేటాయిస్తున్న ఒక టీఎంసీ జలాలను, ఇక 15 వేల ఎకరాల చొప్పున సర్దాల్సి ఉంటుందని, కేవలం ఆరుతడి పంటలకే సాగునీటిని అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఆయా ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో రైతాంగం నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఎస్సారెస్పీ స్టేజ్-1లో అంటే ఎల్ఎండీకి ఎగువన అంటే ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ 0-146 కిలోమీటర్ల ఎల్ఎండీ వరకు 4,62,920 ఎకరాలకు, దిగువన అంటే కాకతీయ కెనాల్ 146-284 కి.మీ., వరకు అంటే మైలారం వరకు 5,05,720 ఎకరాలకు మొత్తంగా 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. ఎస్సారెస్పీ స్టేజీ-2 అంటే కాకతీయ కాలువ 284 కి.మీ నుంచి 347 కి.మీ వరకు ఉంటుంది. దీని కింద మొత్తం 4.4 లక్షల ప్రతిపాదిత ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం 3.65 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే మేరకే కాలువ పనులు పూర్తయ్యాయి. ఆ మేరకే కొద్దికాలంగా అందిస్తున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 మొత్తం కలుపుకుని 13.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆయకట్టు మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి ప్రతి సీజన్లో సాగునీటిని విడుదల చేయడం పరిపాటి. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు జోన్-1గా పిలుస్తుండగా, అందులో డీ-5 నుంచి డీ-94 వరకు కాలువలు వస్తాయి. ఈ ఆయకట్టుకు దాదాపు 40 టీఎంసీల వరకు, ఎల్ఎండీ దిగువ నుంచి 284 కి.మీ వరకు జోన్ 2-గా అంటే డీబీఎం-1 నుంచి డీబీఎం-56 వరకు ఉన్న ఆయకట్టుకు దాదాపు 55 టీఎంసీలు, అటు తరువాత డీబీఎం-74 వరకు ఉన్న జోన్-3కి మొత్తంగా 25 టీఎంసీల మేర సాగునీరు అవసరమవుతుంది. ప్రతీ యాసంగిలో ఆయా జోన్లకు 16 తడుల వరకు మొత్తంగా 120 టీఎంసీల మేర జలాలు అవసరం. ప్రస్తుతం ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, ఎంఎంఆర్‌లో మొత్తంగా 127 టీఎంసీలు ఉన్నాయి. వేసవి తాగునీటి అవసరాలు, ఆవిరి నష్టాలు, డెడ్‌స్టోరేజీ పోతే నికరంగా వినియోగానికి 100 టీఎంసీలు కూడా అందుబాటులో ఉండవని అధికారులు చెప్తున్నారు.
ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు అంటే జోన్-1 వరకు మాత్రమే ప్రస్తుతం నీరిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 80 టీఎంసీలు ఉన్నప్పటికీ, అందులో డెడ్‌స్టోరేజీ కింద 5 టీఎంసీలు, మిషన్‌భగీరథ తాగునీటి అవసరాలకు 7 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 2 టీఎంసీలు మొత్తంగా 14 టీఎంసీలు పోతే, అందుబాటులో ఉండేది నికరంగా 66 టీఎంసీలు మాత్రమేనని వివరిస్తున్నారు. ఆ జలాల్లోనూ ఎల్ఎండీ వరకు 40 టీఎంసీలు, సరస్వతి కెనాల్‌కు 6 టీఎంసీలు, లక్ష్మీ కెనాల్‌కు 3 టీఎంసీలు, అలీసాగర్‌కు 4.50, గుత్పకు 3.5 టీఎంసీలు, చౌటుపల్లి హన్మంతరెడ్డి ఆయకట్టుకు ఒక టీఎంసీ చొప్పున మొత్తంగా 58 టీఎంసీల వరకు అవసరమవుతాయని వివరిస్తున్నారు. ఇవికాకుండా ఆయా కాలువల కింద ట్రాన్స్మిషన్ నష్టాలు, రైతులు ఎక్కడికక్కడ నీటిని మధ్యలోనే మోటర్లతో తోడుకోవడం ఉంటుందని, అదనంగా కూడా జలాలను విడుదల చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఎల్ఎండీకి దిగువకు నీటిని విడుదల చేయలేమని అధికారులు స్పష్టంచేస్తున్నారు.
యాసంగిలో ప్రాజెక్టుల కింద ఎంత నీటిని విడుదల చేయాలనే అంశంపై రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ మంగళవారం జలసౌధలో సమావేశం కానున్నది. ఆయా ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం పరిగణనలోనికి తీసుకుని, ఏ ప్రాజెక్టు కింద ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే అంచనాలపై చర్చించనున్నారు. మేజర్, మీడియం, మైనర్ అన్ని కలిపి మొత్తంగా 40 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉన్నది. నిరుడు కేవలం 28 లక్షల ఎకరాల వరకు సాగునీటిని అందించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవగా ఏ మేరకు ఆయకట్టుకు నీటిని అందిస్తారో ఈ సమావేశంలో తేలనున్నది. మరోవైపు డిసెంబర్ 15 నుంచి సాగునీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎస్సారెస్పీ అధికారులు ఎల్ఎండీ ఎగువకే నీటిని విడుదల చేస్తామని చెప్తుండటంతో ప్రస్తుతం స్టేజీ-2 ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఎల్ఎండీ, ఎంఎంఆర్‌లో కలుపుకుని 47 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 67 టీఎంసీలు నీటినిల్వలు ఉన్నా, హైదరాబాద్ సహా తాగునీటి, ఆవిరి నష్టాలను మినహాయిస్తే నికరంగా 50 టీఎంసీలు కూడా అందుబుటులో ఉండని పరిస్థితి నెలకొన్నది. ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకే దాదాపు 53 టీఎంసీలు అవసరమవుతాయని అంచనా. మొత్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలు ఎల్ఎండీ దిగువ అంటే స్టేజీ-1 వరకు మాత్రమే అందే పరిస్థితి నెలకొన్నది. స్టేజీ-2 కింద దాదాపు 3.65 లక్షల ఎకరాలకు నీటి కొరత ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక టీఎంసీతో 10 వేల ఎకరాల చొప్పున గాకుండా, 15 ఎకరాల చొప్పున సాగునీటిని, అదీ ఆరుతడి పంటలకు అందిస్తే స్టేజీ-2 కూడా సాగునీటిని అందించవచ్చని ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం.