SSC Exam Paper Leak | వరంగల్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహారంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి అత్యంత సన్నిహితుడు బూరం ప్రశాంత్‌తోపాటు మరో ఇద్దరిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మైనర్ ఉన్నాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన బాలుడు, ఇదే గ్రామానికి చెందిన మౌటం శివగణేశ్ ఈ వ్యవహారంలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన బూరం ప్రశాంత్‌ను ఈ వ్యవహారంలో ప్రధాన బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. పదో తరగతి హిందీ పేపర్ కాపీ చేసిన వ్యవహారంలో వరంగల్ పోలీసులు కొద్ది గంటల్లోనే నిందితులను గుర్తించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం సాయంత్రం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘కమలాపూర్ మండలం, ఉప్పల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. మైనర్ బాలుడైన శివగణేశ్.. ఉప్పల్ గ్రామానికి చెందిన తన మిత్రుడి కోసం చెట్టు కొమ్మ పట్టుకొని ఒకటో అంతస్థులోని పరీక్షా కేంద్రంలోకి వెళ్లాడు. ఆ చెట్టు రూమ్ నం.3 కిటికీకి ఆనుకొని ఉంది. అందులో పరీక్ష రాస్తున్న హరీశ్ అనే విద్యార్థి వద్ద పేపర్ తీసుకొని సెల్ఫోన్లో ఫొటో తీశాడు. పరీక్ష ఉదయం 9.30కు ప్రారంభం కాగా.. శివగణేశ్ 9.45 గంటలకు ఫొటో తీశాడు. అనంతరం దానిని 9.59కి ‘ఎస్సెస్సీ 2019-20’ అనే వాట్సాప్ గ్రూపులోకి పంపాడు.
ఈ గ్రూపు నుంచి అది బూరం ప్రశాంత్ సెల్‌ఫోన్‌కు చేరింది. ప్రశాంత్ దానిని 10.46 గంటల నుంచి వందలకొద్దీ వాట్సాప్ గ్రూపులకు ఫార్వర్డ్ చేశాడు. తొలుత హనుమకొండలోని ‘సీను ఫ్రెండ్స్’ మీడియా గ్రూపులో పోస్టు చేశాడు. ఆ తర్వాత 11.10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి హిందీ పేపర్‌ను పంపాడు. ఇదంతా ఓ పథకం ప్రకారమే జరిగినట్టు తెలుస్తున్నది. గతంలో ఓ టీవీ చానెల్ రిపోర్టరుగా పని చేసిన ప్రశాంత్ ఆ అనుభవంతో పేపర్ లీక్ అయ్యిందని స్వయంగా వార్త రాసి వరంగల్ మీడియా గ్రూపులలో వేశాడు. ప్రశ్నపత్రం ఫొటోతోపా టు.. బ్రేకింగ్ న్యూస్.. వరంగల్‌లో హిందీ పేపర్ లీక్. ఉదయం 9.30 గంటలకే లీకైన ప్రశ్నపత్రం. వరుసగా రెండోరోజు ప్రశ్నపత్రం లీక్, ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఎస్సెస్సీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నపత్రం ప్రత్యక్షం’ అంటూ పోస్ట్ చేశాడు. రెండు గంటల వ్యవధిలో ఏకంగా 142 ఫోన్ కాల్స్ మాట్లాడాడు. వరంగల్, హైదరాబాద్‌లోని మీడియా ప్రతినిధులకు వాట్సాప్ చేయడంతోపాటు పేపర్ లీకైనట్టుగా వార్తలు ప్రసారం చేయాలని అందరికీ స్వయంగా ఫోను చేశాడు.
పిల్లల తల్లిదండ్రుల్లో అభద్రతను పెంచడమే లక్ష్యంగా ప్రశాంత్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ఉద్దేశపూర్వకంగా పేపర్ లీకైందని ప్రచారం చేశాడు. ఇలా హిందీ పేపర్ చాలా గ్రూపులలో చక్కర్లు కొట్టడంతో విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు సైబర్ విభాగం, స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. ప్రశాంత్, గణేశ్‌తోపాటు మైనర్ నిందితుడిపై మాల్‌ప్రాక్టీస్ చట్టం, సెక్షన్-5 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్టు పోలీసు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రశాంత్ మొదట పోస్టు చేసిన కెమెరామెన్ సీను గ్రూపు అడ్మిన్‌కు నోటీసులు ఇస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఏసీపీ తిర్మల్, సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కమలాపూర్ ఎస్ఐలు చరణ్, సతీశ్, హసన్‌పర్తి ఎస్ఐలు విజయ్, సతీశ్, సైబర్ క్రైమ్ విభాగం ఏఏవో ప్రశాంత్, కానిస్టేబుళ్లు కిశోర్, రాజు, ఆంజనేయులును వరంగల్ సీపీ అభినందించారు.
టెన్త్ హిందీ పేపర్ లీక్ చేసేందుకు ప్రయత్నించి అరెస్టయిన బూరం ప్రశాంత్ బీజేపీ కీలక కార్యకర్తగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఆరెపల్లికి చెందిన ప్రశాంత్ చిన్నప్పటి నుంచి ఆరెస్సెస్, ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేశాడు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పీజీ చదివాడు. అనంతరం హైదరాబాద్‌లో కొంతకాలం హెచ్ఎంటీవీ రిపోర్టరుగా పనిచేశాడు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనకు సన్నిహితుడిగా ఉంటున్నాడు. బండి సంజయ్ కార్యక్రమాలకు అనుగుణంగా వాట్సాప్‌లో పోస్టులు పెడుతుంటాడు. హెచ్ఎంటీవీ నుంచి వైదొలిగిన అనంతరం పూర్తిగా బీజేపీ, దాని అనుబంధ సంఘాల కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ… బీజేపీ భావజాలానికి అనుకూలంగా పోస్టులు పెడుతుంటాడు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల మీడియా కవరేజీ కోసం అన్ని వాట్సాప్ గ్రూపులలో సమాచారం ఇస్తున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో నిత్యం సంబంధాలు కొనసాగిస్తున్నాడు.