Assembly | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అధికారపక్షం ఏది చేసినా ఒప్పే.. ప్రతిపక్షం ఏది చేసినా తప్పే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ సర్కారు. శాసనసభలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. సభలో, మీడియా పాయింట్ వద్ద మాట్లాడే విషయంలో, నిరసన తెలిపే అంశంలో ఈ వ్యత్యాసాలు స్పష్టంగా కనిపించాయి. శాసనసభలో తమ అభిప్రాయం చెప్పేందుకు విపక్షాలకు మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కేస్తున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు బీఆర్ఎస్ సభ్యులు మీడియా ఎదుట వాపోయారు. సభను వాకౌట్చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకూ విపక్షానికి అవకాశం ఇవ్వడం లేదు. కొత్త రూల్ అంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు.
శుక్రవారం సభను వాకౌ ట్ చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వస్తుండగా.. పది మంది మార్షల్స్ అడ్డుకున్నారు. వాకౌట్కు కారణాలు, సభలో పరిస్థితులపై మీడియా ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
అటు సభలో, ఇటు మీడియా పాయింట్లో ప్రధాన ప్రతిపక్షం గొంతు వినిపించకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. అధికారంలో ఉండి కూడా అటు సభలో, ఇటు మీడియా పాయింట్లోనూ వాళ్లే మాట్లాడుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమో అధికారపక్ష ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలుపడంపైనా సర్కారు ఆంక్షలు విధిస్తున్నది.