కొడిమ్యాల, జూన్ 26: సాంచాలు నడువక ఉపాధి కరువై.. బతుకు భారమై, అప్పులు పెరిగి జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సందీప్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దాసరి దేవయ్య (58)కు భార్య, కొడుకు, కూ తురు ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సిరిసిల్లలో సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కొన్ని రోజుల క్రితం కూతురి పెండ్లి చేశాడు. అప్పటికే అప్పులు ఎక్కువయ్యాయి. కొడుకు వేణు గ్రామంలో కూలి పనులు చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం దేవయ్య సిరిసిల్లకు వెళ్లాడు. సాంచాల పని కోసం వెతికాడు. ఎక్కడా నడవకపోవడంతో కొడుకు వేణుకు ఫోన్ చేసి ‘ఇక్కడ పని లేదు. అప్పులు ఎక్కువ ఉన్నయి. ఎట్లా బతుకుడు. ఆత్మహత్య చేసుకుం టా’ అని చెప్పడంతో ‘వద్దు నాన్న.. ఎలాగోలా బతుకుదాం’ అని సర్దిచెప్పాడు. దీంతో దేవయ్య నల్లగొండ గ్రామానికి చేరుకోగానే మిషన్ భగీరథ ట్యాంక్ వద్దకు వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు వేణు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.