బయ్యారం, మే 15 : ఇందిరమ్మ ఇండ్ల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామ పంచాయతీని పైలట్ గ్రామంగా అధికారులు ఎంపిక చేశారు. జనవరి 26న ఎమ్మెల్యే కోరం కనకయ్య ధర్మపురం గ్రామంలో 40 మందికి, రాయికుంటలో 32 మందికి, నామాలపాడులో 42 మందికి చొప్పున మొత్తం 114 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు అందజేశారు. ఇచ్చిన పది రోజులకే గ్రామ పంచాయతీ సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి, సంతకాలు పెట్టించి మళ్లీ ఇస్తామంటూ వాటిని వెనక్కి తీసుకున్నారు. కొందరు పత్రాలు వెనక్కి ఇవ్వగా, మరికొందరు ఇచ్చేందుకు నిరాకరించారు.
గ్రామంలో మళ్లీ సర్వే చేసిన అధికారులు నామాలపాడులో ఇద్దరికి, రాయికుంటలో ఐదుగురికి, ధర్మపురంలో 19 మందికి మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయని చెప్పి, ముగ్గు పోశారు. తొలుత మంజూరు పత్రాలు అందుకున్నవారిలో కొందరు ఇల్లు మంజూరైందన్న సంతోషంతో ఉన్న ఇంటిని కూలగొట్టుకున్నారు. మరికొందరు నిర్మాణ సామగ్రి కొనుగోలు చేశారు. ఇల్లు వచ్చిందని ఆశపడితే నిరాశే ఎదురైందని, పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో విజయలక్ష్మిని వివరణ కోరగా.. 26 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, మరో 24 మందికి త్వరలో మంజూరవుతాయని తెలిపారు.