హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : అనుభవజ్ఞులు లేకుండా దిగువస్థాయి అధికారులతో విచారణ చేసి రిపోర్టు సమర్పించామనేది పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పూర్తిచేసి ఇటీవలే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రిపోర్టును నివేదించడం, దాని ప్రకారం ప్రభుత్వం 38 మంది ఇరిగేషన్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, విజిలెన్స్ రిపోర్టుపై పలువురు ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇదే విషయమై ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవలే కథనం ప్రచురితమైంది. దీనిపై తాజాగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్పందించింది. విజిలెన్స్ కమిషన్లో వివిధ విభాగాల నుంచి ఇంజినీర్లు ఉన్నారని తెలిపింది. విచారణకు పిలిచి అప్పటికప్పుడే సమాధానాలు ఇవ్వాలని, డాక్యుమెంట్లు సమర్పించేందుకు సమయమివ్వలేదని, వివరణలు ఇచ్చినా పరిగణలోకి తీసుకోలేదని చెప్పడం అవాస్తమని ఖండించింది. పూర్తిగా నిబంధనలకు లోబడే విచారణ జరిపినట్టు పేర్కొన్నది.