చింతకాని, మే 26 : ‘మా కోసం, మా కుటుంబాల పోషణ కోసం ఎన్నో ఏండ్లుగా ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని అసలు మీరు రైతులే కాదు అంటూ చింతకాని ఎస్సై బాధ్యతారహితంగా ప్రకటనలు చేయడం తీవ్రంగా బాధించాయి. మేం రైతులం కాదని సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎస్సై ఎవరు?’ అని ఖమ్మం జిల్లా చింతకాని మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్తోపాటు బాధితులు మండిపడ్డారు. మంగళవారం చింతకానిలో వారు మీడియాతో మాట్లాడారు.
మక్కజొన్న బస్తాలను కాంటా వేసి కొనుగోలు కేంద్రాల్లో పెట్టి దాదాపు 55 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లారీలను సీరియల్ ప్రకారం పంపించాలని సొసైటీ సీఈవోను పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. సొసైటీ అధికారులు కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే ట్రక్షీట్లు ఇస్తున్నారని, దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన వందలాది మంది రైతులు శాంతియుతంగా సొసైటీ గేటు వద్ద ఆందోళన చేశారని గుర్తుచేశారు.
రైతుల బాధను అర్థం చేసుకోకుండా.. తాళం వేసిన ఘటనను సాకుగా చూపుతూ అక్రమ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. దాదాపు 15 ఎకరాలకుపైగా మకజొన్న పంట సాగు చేశామని, ఆ పంట ను అమ్ముకోవడానికి ఇదే సొసైటీ కార్యాలయం తమకు ట్రక్షీట్లు కూడా జారీ చేసిందని, అలాంటిది.. ఇప్పుడు తాము రైతులం కాదని ఎస్సై వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉన్నదని మండిపడ్డారు. తమ గ్రామానికి వచ్చి ఎవరిని అడిగినా తాము రైతులమనే చెబుతారని స్పష్టంచేశారు.
పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా మారి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం తన సొంత నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో బాధిత రైతులు జరగబోయిన కృష్ణ, ఆకుల చంద్రయ్యతోపాటు బీఆర్ఎస్ నాయకులు హన్మంతరావు, గురజాల హన్మంతరావు, బొడ్డు వెంకటరామారావు, షే క్ షబ్బీర్, పిన్నెల్లి శ్రీనివాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.