హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్లో ఇస్తామన్న డీఏ ఏదీ..? వారంలో ఇస్తామన్న ఈహెచ్ఎస్ ఎక్కడ..? అని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీఎస్సీ) సర్కారును ప్రశ్నించింది. 30నెలలు గడిచినా కొత్త పీఆర్సీ ఊసేలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. యూఎస్పీఎస్సీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
రిటైరైన ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయడంలేదని, విద్యారంగంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఐక్య పోరాటానికి సిద్ధంకావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ నేతలు చావ రవి, ఏ వెంకట్, ఎన్ తిరుపతి, ఎం సోమయ్య, టీ లింగారెడ్డి, జాడి రాజన్న, హరికృష్ణ, వీ శ్రీనునాయక్, విజయ్‌కుమార్, రవీందర్, మహేశ్, సైదులు తదితరులు పాల్గొన్నారు.