మొయినాబాద్, జూలై 9: రంగారెడ్డి మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి రైతుల భూములను గోశాల కోసం తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నదాతల ఆందోళన కొనసాగుతున్నది. ప్రభుత్వ అధికారులు ఎప్పుడు వచ్చి, భూములు స్వాధీనం చేసుకుంటారోనని రైతులు కంటిమీద కునుకులేకుండా మూడురోజులుగా పొలాల వద్ద కాపలా కాస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో అన్నం పెట్టే రైతులను వేధిస్తున్నదని మండిపడ్డారు. రైతులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు నిలుస్తున్నది. బుధవారం ఎన్కేపల్లికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి మాట్లాడుతూ గోశాల కోసం పచ్చని పంట పొలాల భూములను లాక్కోవాల్సిన అవసరమేంటని నిలదీశారు. రైతులు 70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుని అన్యాయం చేయొద్దని కోరారు.