ముషీరాబాద్, ఫిబ్రవరి 28: మెగా డీఎస్సీ వేసి ఒకేసారి పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. నిరుద్యోగులు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని భావిస్తున్నారని, 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఐదు వేలు, పది వేల ఉద్యోగాలంటూ మోసపూరిత నాటకానికి తీస్తున్నారని మండిపడ్డారు.
బుధవారం ఆయన విద్యానగర్‌లోని బీసీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొంతమంది విద్యాశాఖాధికారుల మాటలు నమ్మి ప్రభుత్వం గుడ్డిగా ముందుకు వెళ్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే టెట్ నిర్వహించి, పూర్తిస్థాయిలో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. బీసీ నేత ప్రధానిగా ఉన్నా వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 60 శాతం బీసీలు పేదరికంలో మగ్గుతుంటే ‘వికసిత భారత్’ అంటూ ఊదరగొడుతున్నారని తూర్పారబట్టారు. సమావేశంలో బీసీ సంఘం నేతలు నీల వెంకటేశ్, లాల్‌కృష్ణ, రాజ్‌కుమార్, రాజేందర్ పాల్గొన్నారు.