కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏడాదైనా ఒక్క నోటిఫికేషన్ వేయకపోవడంపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. శనివారం అశోక్‌నగర్‌లో జాబ్ క్యాలెండర్‌కు పిండప్రదానం చేసి ఇలా నిరసన తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ‘పుట్టుక నీది. చావు నీది. బతుకంతా దేశానిది’ అన్న కాళోజీ స్ఫూర్తితో కొట్లాడిన్రు. రాష్ర్టాన్ని సాధించిండ్రు. మధ్యలో కాంగ్రెస్ మోసకారి వాగ్దానాల బుట్టలో పడ్డరు. 2 లక్షల ఉద్యోగాలిస్తామంటే నమ్మిండ్రు. జాబ్ క్యాలెండర్ అంటే ఇగ మాకు కొలువులిచ్చినట్టేనని అనుకున్నరు. గ్యారెంటీలంటే.. వారెంటీ వంటిదనుకున్నరు. బస్సుయాత్ర చేపిస్తే భ్రమపడ్డ రు. అమ్మలక్కలను బతిమిలాడి కాంగ్రెస్‌ను గెలిపించిండ్రు. తీరా నమ్మినందుకు తాము గెలిపించిన కాంగ్రెస్సే మోసం చేయడంతో ఇప్పుడు గోస పడుతున్నరు. ఆఖరికి అశోక్‌నగర్ అడ్డామీద నిరుద్యోగులుగానే మిగిలిండ్రు.
ఇలా గోస పడుతున్నది మరెవరో కాదు రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థి యువకులు. అ ప్పుడూ, ఇప్పుడు కొట్లాడిన నిరుద్యోగులు నేడు కొత్త పల్లవి అందుకున్నరు. ‘ప్రాంతేతరు డు మోసం చేస్తే పొలిమెరలదాకా తరిమికొట్టు. ప్రాంతంవాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరపెట్టు’ అన్న అదే కాళోజీ మాటల నుంచే నేడు స్ఫూర్తి పొందిన్రు. మరో పోరాటానికి నిరుద్యోగ సైన్యం జంగ్ సైరన్ మోగించిన్రు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీని విస్మరించిన కాంగ్రెస్ సర్కార్ తీరుపై రగిలిపోతుండ్రు. విడుదల చేసి ఏడాదైనా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో జాబ్క్యాలెండర్కు నిరుద్యోగులు పిండప్రదానం చేసి నిరసన వ్యక్తంచేశారు.
‘అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేస్తాం’ ఇవీ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ గుప్పించిన హామీ లు. అధికారంలోకి వచ్చాక 2024 ఆగస్టు 2న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ లో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ‘తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్-2025’ పేరిట అసెంబ్లీలో విడుదల చేశారు. ఈ క్యాలెండర్ విడుదలై 2025 ఆగస్టు 2 నాటికి సరిగ్గా ఏడా ది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో టీజీపీఎస్సీ నుంచి ఒక్క కొత్త నోటిఫికేషన్ జారీ కాలేదు. గురుకుల రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి ఒక్కటంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా రాలేదు. ఒక్క మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.
ఇత్తేసి పొత్తు కలిపిన చందంగా పాత నోటిఫికేష్లకు కొన్ని కొత్త పోస్టులు కలిపి తామే ఇచ్చామని కాంగ్రెస్ సర్కార్ దబాయిస్తున్నది. తాము భర్తీ చేసినట్టు కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన ఉద్యోగాలన్నీ గతంలో కేసీఆర్ సర్కారు హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినవే కావడం గమనార్హం. గత కేసీఆర్ సర్కారు నింపిన ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేసి తామే ఉద్యోగాలిచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతున్నది. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ ఊసే ఎత్తడం లేదని బీఆర్ఎస్ నేత తుంగ బాలు దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ విడుదలచేసి ఏడాదైనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఏడాది పూర్తయినా ఒక్క నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ శనివారం జాబ్ క్యాలెండర్ వర్ధంతిగా జరుపుకొని నిరసన తెలిపారు. అశోక్‌నగర్‌లో జాబ్క్యాలెండర్కు పిండప్రదానం చేశారు. ‘జాబ్ క్యాలెండర్ వర్ధంతి. కీర్తీశేషులు జాబ్ క్యాలెండర్ గారు జననం 2 ఆగస్టు 2024, మరణం 2 ఆగస్టు 2025’ అంటూ పోస్టర్లపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఈ ఏడాది కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులను మోసం చేసిందని జేఏసీ నేతలు మండిపడ్డారు. పైగా అదిగో ఇదిగో అంటూ మభ్యపెడుతున్నదని వాపోయారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.