హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో టీఆర్ఎస్ బృందం గురువారం ఢిల్లీలో భేటీ అయింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ చేసిన తీర్మానానికి అనుగుణంగా లాంఛనాలు పూర్తిచేయాలని ఈసీ డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈ మేరకు తీర్మానం కాపీని అందజేశారు.
అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీ చిరునామా, పేరు మార్పును 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29(ఏ) క్లాజ్ 9 స్పష్టం చేసిందని, దీనికి అనుగుణంగా ఈసీ నియమావళిని అనుసరించి లాంఛనాలు పూర్తి చేసి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని నివేదించామని తెలిపారు. తీర్మానం కాపీని చట్టపరంగా పరిశీలించి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పారని, ఈ ప్రక్రియ పూర్తికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలవుతున్నందున టీఆర్ఎస్ పేరుతోనే పోటీచేస్తామని, కారు గుర్తు యథావిధిగా ఉంటుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్కు ఈసీ గుర్తింపు వచ్చేవరకు టీఆర్ఎస్ పేరే కొనసాగుతుందని తెలిపారు.