హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంపై పోరాటం చేయడానికి సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీపై ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రవిమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా విభజన హామీల పరిషారం కోసం బీజేపీతో పోరాడాలని నారాయణ సలహా ఇచ్చారు . రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాల కొనసాగింపులో భాగంగా శనివారం మంత్రివర్గ ఉపసంఘం విభజన హామీల పరిషారం కోసం పరిమితమైన ఎజెండాను సాయంత్రం వరకు కుదించారని చెప్పారు. విభజన హామీలను పరిషరించకుండా రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ప్రధాని మోదీ ఇప్పటికీ ఖండించకపోవడం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమవుతుందని నారాయణ పేర్కొన్నారు.