బెల్లంపల్లి, ఫిబ్రవరి 2 : మంచిర్యాల జిల్లా కన్నాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 4 రోజులుగా బుగ్గగూడెం, లక్ష్మీపురం, బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీప ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో ప్రజలు సాయం త్రం కాగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంలేదు. అటవీ అధికారులు శనివారం రాత్రి కన్నాల అటవీ ప్రాంత రహదారిని మూసివేశారు.
ఆదివారం గాలింపు చర్యలు చేపట్టగా కన్నాల శివారులో పెద్దపులి అడుగులను గుర్తించారు. నాలుగు రోజులుగా ఒకే ప్రాంతంలో సంచరిస్తుండడంతో వేటగాళ్ల నుంచి పులికి రక్షణ కల్పించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బుగ్గ రాజరాజ్వేర స్వామి ఆలయ పరిసరాల్లో పులి తిరుగుతుండడంతో భక్తులు అటు వెపు వెళ్లడంలేదు. అర్చకులు గుడికి తాళం వేసి వెళ్లిపోయారు.