దేశంలోని మొత్తం ఇనుప ఖనిజ నిక్షేపాల్లో 12 శాతం ఇక్కడి భూమి పొరల్లోనే మూలుగుతున్నది. 1,41,691 ఎకరాల భూమిలో విస్తారమైన ఖనిజం మెరుస్తున్నది. పూర్తిగా వెలికితీస్తే దాని విలువ ఏకంగా రూ.700 లక్షల కోట్లు! అదే బయ్యారం!! కానీ, ఇక్కడ స్టీల్ ప్లాంటు పెట్టడం లాభదాయకం కాదని కేంద్ర ప్రభుత్వం తప్పుకొంటున్నది! ఖనిజంలో నాణ్యత లేదని సాకులు చెప్తున్నది! ప్లాంటుకు సరిపడా భూమి లేదని, కాలుష్యం పెరిగిపోతుందని కేంద్రమంత్రులు పూటకోరకంగా బొంకుతున్నారు. నిజంగానే ఫ్యాక్టరీ పెట్టడానికి సరైన వసతులు లేవా?
ఇల్లెందు, ఫిబ్రవరి 24: రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అపార ఇనుప ఖనిజం ఉన్నదని దశాబ్దాల క్రితమే గుర్తించారు. ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో 56,690 (1,41,691 ఎకరాలు) హెక్టార్లలో 12 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం ఉన్నదని సర్వే ఆఫ్ ఇండియా దశాబ్దం క్రితమే తేల్చింది. ఇక్కడ ఉన్న ఇనుప ఖనిజం విలువ సుమారు రూ.700 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. దేశంలోని మొత్తం ఇనుప ఖనిజంలో 12 శాతం బయ్యారం ప్రాంతంలోనే ఉన్నదని స్పష్టంచేసింది.
ఇనుప ఖనిజంతోపాటు స్టీల్ ఉత్పత్తిలో కీలకమైన డోలమైట్ బయ్యారానికి 15 కిలోమీటర్లు, ధర్మాపురానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధారంలో పుష్కలంగా ఉన్నది. ఏపీలోని విశాఖ స్టీల్ప్లాంటుకూ ఇక్కడి నుంచే డోలమైట్ సరఫరా అవుతున్నది. నామాలపాడు వద్ద కూడా డోలమైట్ విస్తారంగా ఉన్నది. బొగ్గు బయ్యారానికి 24 కిలోమీటర్ల దూరంలోని ఇల్లెందులో లభ్యమవుతున్నది. బయ్యారం మండలంలో కూడా అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. దానిని వెలికితీయడానికి సమయం పడుతుందని అనుకొంటే ఇల్లెందు నుంచి తెప్పించుకోవచ్చు.
విద్యుత్తు కేటీపీఎస్ పాల్వంచ 75 కిలోమీటర్ల దూరమే. మరోవైపు ధర్మాపురానికి 18 కిలోమీటర్ల దూరంలో బూడిదంపాడు వద్ద పవర్‌గ్రిడ్ ఉన్నది. అక్కడి నుంచి కూడా విద్యుత్తును తీసుకోవచ్చు. పరిశ్రమకు కావాల్సిన నీరు బయ్యారానికి మూడు వైపులా ఉన్న పాకాల ఏరు, అలిగేరు, వట్టేర్లలో పుష్కలంగా ఉన్నది. ఈ ఏర్లలో నీటిని ప్రస్తుతం రెండు శాతం కూడా వాడుకోవటంలేదు. గార్ల మండలం ముల్కనూరు వద్ద మంజూరైన మున్నేరు ప్రాజెక్టును పూర్తిచేసినా, తులారం బీఎన్ గుప్తా ప్రాజెక్టు ఎత్తు రెండు మీటర్లు పెంచినా వ్యవసాయంతోపాటు ఉక్కు పరిశ్రమకు సరిపడినంత నీరు లభిస్తుంది.
ప్లాంటు నిర్మాణానికి ఇక్కడ కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉన్నది. ధర్మాపురం రెవెన్యూ పరిధిలోని 452 సర్వే నంబర్లో 4 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అందులో 13 వందల ఎకరాలు అసైన్ అయ్యింది. ప్రభుత్వం కర్మాగారాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. అలా 4 వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్టే. ఇక్కడ ప్లాంటు నిర్మాణానికి 2700 ఎకరాల భూమి సరిపోతుందని నిపుణుల కమిటీ తేల్చింది. ప్రధాన ఫ్యాక్టరీ నిర్మాణానికి 2,200 ఎకరాలు సరిపోతుంది. మిగతా 500 ఎకరాలు ఇతర అవసరాలకోసం కేటాయిస్తారు. అంటే ప్లాంటు ఏర్పాటుకు అవసరమైనదానికంటే ఎక్కువ భూమి అందుబాటులో ఉన్నది. ఇక్కడ స్టీల్ పరిశ్రమ నిర్మిస్తే అతితక్కువ రవాణా ఖర్చులతో స్టీల్‌ను రవాణా చేయవచ్చు. దక్షిణమధ్య రైల్వే మార్గం ధర్మాపురం గ్రామానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది.
కాలుష్య నివారణకు ఇక్కడ సహజసిద్ధంగా పెరిగిన దట్టమైన అడవులు, చెట్లు ఉన్నాయి. వీటితోపాటు మానవ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ధర్మాపురం చుట్టూ అడవులే ఉన్నాయి. ఇన్ని వనరులున్న బయ్యారంలో వసతులు లేవని, నాణ్యమైన లేదని బీజేపీ ప్రభుత్వం చెప్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. 1976లో ఖమ్మం జిల్లా పాల్వంచలో ప్రారంభమైన ఏపీ స్టీల్స్ లిమిటెడ్‌ను నాటి పాలకులు వివక్షతో మూతపడేలా చేశారని, నేటి కేంద్ర పాలకులు బయ్యారంలో ప్లాంటే రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం చూపుతున్న వివక్షపై టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టింది. ఇటీవలే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు బయ్యారంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. త్వరలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి ఏపీలోనే బయ్యారం ఇనుప ఖనిజంపై కుట్ర మొదలైంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇం డస్ట్రీ, మైనింగ్, ఫారెస్టు, ఇరిగేషన్, రెవె న్యూ, విద్యుత్తు, పొల్యూషన్ శాఖల అధికారులు గనులను పరిశీలించారు. ఇక్కడి ఖనిజాన్ని ఏపీకి తరలించే కుట్ర అప్పుడే మొదలైంది. ఇక్కడ పరిశ్రమ పెట్టాలంటే 10 వేల ఎకరాల భూమి అవసరమని నాడు అధికారులు తెలుపటంతో స్థానికులు తీవ్ర నిరసన తెలిపారు. బయ్యారంలో ప్లాంటు నిర్మాణానికి సరిపడా భూమి లేదని చెప్పి, ఇక్కడి విలువైన ఖనిజాన్ని విశాఖ ప్లాంటుకు తరలించాలన్న నాటి ప్రభుత్వ కుట్రను గుర్తించి ఆందోళనకు దిగారు. బయ్యారంలో అన్ని వనరులూ ఒకేచోట ఉన్నా ప్లాంటు ఏర్పాటుపై ఎన్డీయే ప్రభుత్వం కుంటిసాకులు చెప్తున్నది. నిజానికి విశాఖలో ఎటువంటి ఐరన్ ఓర్ నిక్షేపాలు లేకున్నా కేవలం నీటివనరు ఆధారంగానే అక్కడ ఫ్యాక్టరీని నిర్మించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి ఖనిజాన్ని విశాఖకు తరలిస్తున్నారు. బయ్యారంలో ఆ అవసరమే లేదు. ప్లాంటు నిర్మిస్తే ఏ ఇబ్బందీ లేకుండా 50 ఏండ్లు నడపొచ్చని సర్వే ఆఫ్ ఇండియా లెక్కగట్టింది.
బయ్యారంలో 2010లోనే ఇండస్ట్రీ, మైనింగ్, ఫారెస్టు, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్తు, పొల్యూషన్ శాఖల అధికారులు పర్యటించి గనులను పరిశీలించారు. ప్లాంట్ ఏర్పాటుకు 2500 ఎకరాలు అవసరం ఉంటుందని అప్పటి కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలు విడివిడిగా కూడా క్షేత్రస్థాయి పరిశీలన జరిపాయి. ప్లాంట్ ఏర్పాటుకు అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని కేంద్రానికి నివేదికలు ఇచ్చాయి. దాంతో బయ్యారం స్టీల్‌ప్లాంటు ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలో అధికారిగా ప్రకటించింది. వెనువెంటనే దానిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా పొందుపర్చింది.