హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్ మూడు రోజుల కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో నిందితుడిని పేట్‌బషీరాబాద్ పోలీసులు మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పలు వివరాలను పోలీసులు నిందితుడి నుంచి రాబట్టినట్టు తెలిసింది.
బాధితురాలితో పరిచయం అయిన నేపథ్యం, వారి మధ్య ఏర్పడిన సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. ప్రధానంగా డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఘటనపై లోతైన విచారణ జరిపినట్లు తెలిసింది. అలాగే బాధితురాలితో వివిధ అపార్ట్మెంట్లలో కలిసిన విషయాలు, లైంగిక దాడి జరిగిన ఘటనపై కూపీలాగినట్లు సమాచారం.
అయితే చాలా ప్రశ్నలకు నిందితుడు సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నట్లు పోలీసులు చర్చించుకున్నారు. మరోవైపు నిందితుడు సాక్ష్యాలు మాయం చేయడంపై దృష్టి పెట్టిన పోలీసులు.. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా తీసుకున్నట్లు తెలిసింది. వీటిన్నింటితోపాటు నిందితుడు కేసు నుంచి తప్పించుకోవడానికి సహకరించిన వారి సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టినట్లు సమాచారం.
ఈ సమాచారంతో మున్ముందు న్యాయ సలహాలు తీసుకొని, కేసుతో సంబంధమున్న వారిని విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దర్యాప్తు అధికారులకు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లతో కేసు దర్యాప్తు సమగ్రంగా ముందుకు సాగుతుందా..? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.