బిచ్కుంద, జూలై 9: ఏటీఎంలో చోరీ కోసం వచ్చిన దొంగలకు లాకర్ తెరవడం సాధ్యంకాక చివరికి ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటుచేసుకున్నది. మాస్కులు ధరించిన దుండగులు తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డారు. సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి, ధ్వంసం చేసి ఏటీఎంను తెరిచేందుకు యత్నించారు.
ఇది గమనించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. పెట్రోలింగ్ సి బ్బంది అక్కడకు చేరుకునేలోపు దొం గలు ఏటీఎం మెషిన్‌తో ఉడాయించా రు. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు. ఏటీఎంలో రూ.3.95 లక్షల నగదు ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. మరోవైపు, జుక్కల్ మండలం పెద్దగుల్లా శివారులో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని బిచ్కుంద ఠాణాకు తరలించారు.