KCR | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తలాపున గోదావరి పారుతున్నా.. ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించడంలో ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 70 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. అనంతరం ఖమ్మం జిల్లాలో ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఖమ్మం జిల్లాను దాటుకుంటూ వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుండడంతో వా టిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం అది ఆచరణలోకి వచ్చి ఖమ్మం జిల్లావాసుల చిరకాల కల సాకారమైంది.
ఉమ్మడి పాలకుల నీటి కుట్రలకు మరోనిదర్శనం.. జలయజ్ఞంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపాదించిన రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులే. 2005లో ఈ రెండు ప్రాజెక్టులను ప్రతిపాదించినా తెలంగాణ ఏర్పడే వరకూ పనులు పూర్తి చేయలేదు. ఏపీ పునర్విభజన అనంతరం ఈ రెండు ప్రాజెక్టులకు కొత్త సమస్యలు తలెత్తాయి. రాష్ట్ర విభజనలో ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలు ఏపీ రాష్ట్రానికి బదిలీ చేసిన కారణంగా ఇందిరాసాగర్ రుద్రమకోట ప్రాజెక్టు అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారిపోయింది. ఏపీ సహకారం లేనిదే ఖమ్మం జిల్లాలోని ప్రతిపాదిత 1,33,000 ఎకరాలకు నీరు అందివ్వని పరిస్థితి నెలకొన్నది. ప్రాజెక్టు హెడ్ వర్స్ ఏపీలో ఉన్నందున భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టు పైప్‌లైన్ మార్గం కిన్నెరసాని వన్యప్రాణి అటవీ ప్రాంతం నుంచి వెళ్లేవిధంగా డిజైన్ చేయడంతో అనుమతులు రావడం అనుమానంగా మారిపోయింది. వెరసి ఈ రెండు ప్రాజెక్టులు నిరర్థకంగానే మిగిలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
స్వరాష్ట్రం ఏర్పాటు వెంటనే తొలి ముఖ్యమంత్రిగా సాగునీటి ప్రాజెక్టులపై జిల్లాల వారీగా కేసీఆర్ సమీక్షించారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాల్లోని లోపాలు, సాంకేతిక సమస్యలను గ్రహించి ఆ రెండు ప్రాజెక్టులను రీ ఇంజినీరింగ్ చేశారు. ఒకే సమీకృత ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించి, సీతారామ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం జిల్లాలోని 25 మండలాల్లో, వరంగల్ జిల్లాలోని ఒక మండలంలో స్థిరీకరణ సహా మొత్తం 6.74లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించనున్నారు. 2018 ఫిబ్రవరి 16న ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేయగా, బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ లిఫ్ట్ పనులు, పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం ట్రయల్న్‌న్రు నిర్వహించింది.
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, నాగార్జునసాగర్ కాలువ ద్వారా సాగవుతున్న ఆయకట్టుకు మూడు పంటలకు నీరందించేందుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. కొన్నేండ్లుగా కృష్ణానది ఆయకట్టును కూడా స్థీరీకరణ చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రణాళికలను రూపొందించింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌లో నింపి దాని ద్వారా నాగార్జునసాగర్ మొదటి జోన్ అయిన నల్గొండ జిల్లాకు కూడా గోదావరి జలాలను అందించి సుమారు 4 లక్షల ఆయకట్టును స్థీరీకరణ చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలను రూపొందించారు.