హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతను, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిటింగ్) గవర్నింగ్ బోర్డు నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. 2021లోనే ఈ పాలక మండలి గడువు ముగిసినప్పటికీ గత మూడేండ్లుగా కొత్త బోర్డును ఏర్పాటు చేయలేదు. దీంతో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు నిధుల విడుదల, సిబ్బంది నియామకం, సంస్థాగత నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతున్నది. సామాజిక తనిఖీని నామమాత్రంగా నిర్వహిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
గ్రామీణ నిరుపేద కూలీలకు చేతినిండా పనికల్పింలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2004లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. కానీ, ఈ పథకం అమలులో అనేక ఇబ్బందులు ఎదురవడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంతోపాటు పనుల గుర్తింపు, కేటాయింపు, నిధుల విడుదల త్వరగా జరిగేలా చూడాలన్న లక్ష్యంతో 2009 సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సోషల్ ఆడిటింగ్ ఆర్గనైజేషన్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వేతరులైన చైర్మన్, కన్వీనర్తోపాటు 10 మంది సభ్యులను నియమించారు. నిబంధనల ప్రకారం సోషల్ ఆడిటింగ్ బోర్డు కనీసం ఏడాదికోసారైనా సమావేశం కావాల్సి ఉంటుంది. మూడేండ్లకోసారి కొత్తబోర్డును నియమిస్తారు.
గత సోషల్ ఆడిటింగ్ బోర్డు పదవీకాలం 2021లో ముగిసింది. అప్పటి నుంచి కొత్త బోర్డు ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. అప్పటి నుంచి చైర్మన్, కన్వీనర్, సభ్యుల నియామకం చేపట్టలేదు. దీంతో ఉపాధి హామీ నిధుల విడుదల, పనులు గుర్తింపు, అవకతవకల నిర్ధారణ, సిబ్బంది నియామకంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవస్థాగతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతున్నది. పనులు చేసినవారికి కూలీ చెల్లింపుల్లోనూ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సోషల్ ఆడిటింగ్ బోర్డును ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు డిమాండ్ చేస్తున్నారు.