హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో బహుళ జవాబులున్న 7 ప్రశ్నలకు మార్కులు కలుపాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) నిర్ణయించింది. తాజాగా కలిపిన మార్కులతో కూడిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 30న అధికారిక వెబ్సైట్ www.tslprb.in లో పొందుపరుస్తామని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షతోపాటు దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ప్రిలిమినరీలో కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి కంటే ఎకువ సరైన సమాధానాలు ఉన్నాయి. బోర్డు తాము నిర్ధారించిన జవాబులకు మారులు వేసి తుది ఫలితాలు వెల్లడించింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు బహుళ జవాబులున్న ప్రశ్నలకు అదనపు మారులు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం ద్వారా మరికొందరు అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు ఎంపిక కానున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు పార్ట్-2కు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు చైర్మన్ తెలిపారు. ఇందుకోసం ప్రిలిమినరీ హాల్టికెట్ నంబర్లతోనే లాగిన్ అయ్యే అవకాశం కల్పించారు. పార్ట్-2కు దరఖాస్తు చేసుకొన్న వారికి ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రిలిమినరీలో ఉత్తీర్ణులై ఇప్పటికే దేహదారుఢ్య పరీక్ష పూర్తి చేసి తుది పరీక్షకు ఎంపికైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు support@ tslprb.inకి మెయిల్ లేదా 9393711110, 93910 05006 నంబర్లను సంప్రదించాలి.