హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను 34ః66 నిష్పత్తిలో వినియోగించుకొనేందుకు ఒప్పుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. తెలంగాణ వాదనలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశ ఎజెండాలో సరిగా నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ సోమవారం కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. ఈ నెల 6న వార్షిక సమావేశాన్ని నిర్వహించనున్న కేఆర్ఎంబీ.. ఆ సమావేశానికి 16 అంశాలతో ఎజెండాను రూపొందించింది. అందులో కృష్ణా జలాల పంపిణీ అంశం కూడా ఉన్నది. రాష్ట్ర విభజన అనంతరం కుదుర్చుకొన్న తాత్కాలిక ఒప్పందం మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు 34:66 నిష్పత్తిలో కృష్ణా జలాలను వినియోగించుకొంటున్నాయి.
కేవలం ఏడాది కాలానికే కుదిరిన ఈ ఒప్పందాన్ని ఏటా సాగదీస్తూ 2020-21 నీటి సంవత్సరం వరకు పొడిగించుకొంటూ వచ్చారు. దీనిపై తెలంగాణ గత ఏడాది జరిగిన బోర్డు మీటింగ్‌లో అభ్యంతరం తెలిపింది. ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయ్యే వరకూ 50ః50 నిష్పత్తిలో కృష్ణా జలాలను వినియోగించుకొంటామని పట్టుబట్టింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 34 టీఎంసీలను మాత్రమే తరలించుకుపోవాలని, ఆ మేరకు ఆ రాష్ర్టాన్ని కట్టడి చేయాలని షరతు విధించింది. అందుకు కేఆర్ఎంబీ ఒప్పుకోవడంతో 34ః66 నిష్పత్తిలో జలాల వినియోగానికి తెలంగాణ మరోసారి అంగీకరించింది.
తాజాగా కేఆర్ఎంబీ రూపొందించిన బోర్డు మీటింగ్ ఎజెండాలో ఈ అంశాలేవీ లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తన అభ్యంతరాలను, షరతులను ఎజెండాలో పొందుపరచకపోవడాన్ని తప్పుబట్టింది. కృష్ణా జలాలను 34ః66 నిష్పత్తిలో వినియోగించుకోవాలని ఏకపక్షంగా ఖరారు చేయడంపై మండిపడింది. గత సమావేశంలో తెలిపిన అభిప్రాయాలను ఎజెండాలో స్పష్టంగా పొందుపరచాలని నొక్కి చెప్పింది.