హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): టీజీఎస్సీడీసీఎల్తోపాటు రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల పరిధిలో బదిలీలపై ఏకపక్ష నిర్ణయాలను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే మార్గదర్శకాలు ఖరారు చేయాలని కోరింది. శుక్రవారం టీజీపీఈజేఏసీ అధ్యక్షుడు సాయిబాబ, కన్వీనర్ రత్నాకర్‌రావు, నేతలు సదానందం, నెహ్రూనాయక్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
2026 మే, జూన్ నెలల్లో సాధారణ బదిలీలు చేపట్టాలని గతంలో సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యోగ సంఘాలు, యూనియన్లతో చర్చలు జరుపకుండానే బదిలీ విధివిధానాలు రూపొందించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రెండేండ్ల సేవలు పూర్తిచేసిన ఉద్యోగులే ట్రాన్స్‌ఫర్‌కు అర్హులని చెప్పడం సరికాదని, మూడేండ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.