హైదరాబాద్ : రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన వ్యూహం (Vyuham movie ) సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు (High Court) తీర్పును రిజర్వ్ చేసింది. చిత్రంపై బుధ, గురువారాల్లో రెండురోజుల పాటు వాదనలు కొనసాగాయి. వ్యూహం సినిమా ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకులను కించపరిచే విధంగా నిర్మించారని ఆరోపిస్తూ టీడీపీ(TDP) జాతీయ ప్రధానకార్యదర్శితో పాటు పలువురు రెండు నెలల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో వాదనలు, ప్రతివాదనలు జరిగిన తరువాత గురువారం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
చిత్రం విడుదలకు ముందే సెన్సారు బోర్డు అన్నింటిని పరిగణనలోకి తీసుకోలేనందున సినిమాను విడుదల చేయవద్దని టీడీపీ నాయకులు పిటిషన్లో పేర్కొన్నారు. సర్టిఫికెట్ జారీచేసే ముందు ప్రతి సినిమాకూ రివైజింగ్ కమిటీ కారణాలు పేర్కొనాల్సిన అవసరం లేదని ‘వ్యూహం’ నిర్మాతలు బుధవారం తెలంగాణ హైకోర్టులో వాదించారు. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి ‘వ్యూహం’ సినిమాకు సెన్సారు బోర్డు (సీబీఎఫ్సీ) ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ జనవరి 22న తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుపై నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు రాంగోపాల్‌వర్మ, రామదూత క్రియేషన్స్ హైకోర్టులో అప్పీలు చేసుకోగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కోర్టు సమయం ముగిసిపోవడంతో ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది .