హైదరాబాద్, జనవరి 24, (నమస్తే తెలంగాణ): కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో పనిచేస్తూ శిక్షణ సమయంలో అదృశ్యమైన కానిస్టేబుల్ ఎం శ్రీకాంత్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శ్రీకాంత్ తనంతట తానుగా వెళ్లిపోయినట్టు (డిజార్డర్)గా ప్రకటించి ఉద్యోగం నుంచి తొలగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఆయనను సర్వీస్ నుంచి తొలగిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.
శ్రీకాంత్ పదేండ్లకుపైగా కనిపించకుండా ఉన్న కాలంలో ఆయన ఉద్యోగంలో కొనసాగినట్టు పరిగణించాలని తేల్చిచెప్పింది. శ్రీకాంత్‌కు లభించాల్సిన పెన్షన్, ఇతర సేవా ప్రయోజనాలను ఆయన కుటుంబసభ్యులకు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి, సీఆర్పీఎఫ్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఆయన ఎడమ కాలు తొలగించాల్సి వచ్చింది. దీంతో ఆయన యుద్ధ విధులకు అనర్హుడని వైద్య బోర్డు తేల్చింది. అనంతరం శ్రీకాంత్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఆర్పీఎఫ్లోని పునరావాస బోర్డు నిర్ణయించింది. పదేండ్ల సర్వీస్ పూర్తయ్యేలా అవకాశం ఇచ్చి, వృత్తి నైపుణ్య శిక్షణ కల్పించాలని పునరావాస బోర్డు సిఫారసు చేసింది. ఈ సిఫారసుల అమల్లో భాగంగా శ్రీకాంత్‌ను కంప్యూటర్ శిక్షణకు పంపారు. దీంతో 2015 ఫిబ్రవరిలో ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో చేరిన శ్రీకాంత్.. 3 నెలల శిక్షణ పూర్తిచేసుకున్నారు.
అనంతరం 3 రోజుల్లో ఇంటికి తిరిగి రావాల్సిన శ్రీకాంత్.. 2015 జూన్ 1 నుంచి కనిపించకుండా పోయారు. జూన్ 2న ఆయన రోల్‌కాల్‌కు హాజరుకాకపోవడంతో అధికారులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. బస్ స్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో సీఆర్పీఎఫ్ అధికారులు ఢిల్లీలోని బాబా హరిదాస్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు చివరికి శ్రీకాంత్ ఆచూకీ తెలియలేదని స్పష్టం చేశారు.
అనంతరం శ్రీకాంత్ తనకు తానుగా వెళ్లిపోయినట్టు సీఆర్పీఎఫ్ అధికారులు ప్రకటించి, శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. ఈ విచారణకు శ్రీకాంత్ హాజరుకాకపోవడంతో ఎక్స్‌పార్టీ విచారణ నిర్వహించారు. ఈ విచారణ అనంతరం 2017 జనవరిలో శ్రీకాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అదే సమయంలో ఆయనను పట్టుకునేందుకు అరెస్ట్ వారెంట్ కూడా జారీచేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. శ్రీకాంత్ ఆచూకీ తెలియలేదని గ్రామస్తులు, కుటుంబసభ్యులు, అధికారులు తెలిపారు.
సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతుండగానే శ్రీకాంత్ కనిపించకుండా పోయాడని ఆయన తండ్రి అప్పారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శిక్షణ కేంద్రం నుంచి శ్రీకాంత్ తనంతట తానే వెళ్లిపోయినట్టు ప్రకటించడం, ఆయన కుటుంబానికి పెన్షన్, గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు అందజేయకపోవడం అన్యాయమని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక అంశాలను ఎత్తి చూపింది. సీఆర్పీఎఫ్ నియంత్రణలో శిక్షణలో ఉండగానే శ్రీకాంత్ కనిపించకుండా పోయారని, ఇంటి నుంచి లేదా సెలవుల్లో ఉండగా ఆయన అదృశ్యం కాలేదని పేర్కొన్నది.
ఈ విషయమై స్వయంగా సీఆర్పీఎఫ్ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేశారని, పదేండ్లకుపైగా గడిచినప్పటికీ శ్రీకాంత్ ఆచూకీ కనుగొనలేకపోయారని గుర్తుచేస్తూ.. ఇలాంటి పరిస్థితిలో సీఆర్పీఎఫ్ నిర్వహించిన ఎక్స్‌పార్టీ విచారణ కంటి తుడుపు చర్య మాత్రమేని వ్యాఖ్యానించింది. సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రం నుంచి కనిపించకుండా పోయిన శ్రీకాంత్‌ను గుర్తించలేనప్పుడు ఆయనను ‘డిజార్డర్’గా ప్రకటించి ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం న్యాయసమ్మతం కాదని స్పష్టం చేస్తూ.. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
తమ వద్ద రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ లేవని విచారణ సమయంలో సీఆర్పీఎఫ్ చెప్పడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. శ్రీకాంత్ అదృశ్యంపై ఆయన తండ్రి మరోసారి ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. శ్రీకాంత్‌ను మిస్సింగ్ ఉద్యోగిగా పరిగణించి ఆయన కుటుంబసభ్యులకు పెన్షన్, ఇతర సేవా ప్రయోజనాలు అందజేయాలని సీఆర్ఫీఎఫ్ అధికారులను ఆదేశించింది. ఒకవేళ శ్రీకాంత్ తిరిగివస్తే ఆయన కుటుంబం పొందిన పెన్షన్ ఇతర ప్రయోజనాలను తిరిగి చెల్లించేందుకు అంగీకరిస్తూ సీఆర్పీఎఫ్ అధికారులకు అఫిడవిట్ ఇవ్వాలని శ్రీకాంత్ తండ్రికి సూచించింది.