తమిళనాడులో మాత్రమే 50 శాతం మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 1990లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసినప్పుడు హైకోర్టు కొట్టివేసింది. మూడుసార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, జీవోలు ఇచ్చిన ప్రతిసారి ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. 1994లో జయలలిత ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని పీవీపై ఒత్తిడి తేవటంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాతే 9వ షెడ్యూల్లో చేర్చారు.
ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం. బీసీలను ఏమార్చటానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చినా దాన్ని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. తనే బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో, ప్రభుత్వం చేసిన అర్డినెన్స్ను అనివార్యంగా గవర్నర్ తిరస్కరించడం మినహా మరో మార్గం లేదు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును ముందుగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తర్వాత మంత్రివర్గ టేబుల్ మీదకు రావాలి. చర్చ అనంతరం ఆమోదించాలి. ఇప్పటివరకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రజల ముందు పెట్టనేలేదు. అన్ని లోపాలతో తీసుకువచ్చే అర్డినెన్స్ న్యాయపరంగా నిలబడవని న్యాయ నిపుణులు చెప్తున్నారు.
రాష్ర్టాలు చేసే కులగణన కూడా చెల్లుబాటు కాదని కేంద్రం ఎప్పుడో చెప్పింది. చెల్లబాటు కాని కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం.. రిజర్వేషన్లను పూర్తిగా ఎగ్గొట్టే కుట్రగా బీసీ నేతలు అనుమానిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వపాలనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున స్థానిక ఎన్నికలను పూర్తిగా పక్కన పెట్టేలా సర్కారు తీరు ఉన్నదని మండిపడుతున్నారు.