గవర్నర్ తీరుతో హతాశులైన ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్‌కు సిద్ధమయ్యారు. ‘రాజకీయంగా ప్రభుత్వంతో గవర్నర్‌కు విబేధాలుంటే వాళ్లువాళ్లు చూసుకోవాలి. కానీ 43 వేల మంది కార్మిక కుటుంబాలకు సంబంధించిన బిల్లుపై గవర్నర్ రాజకీయ కోణంలో ఆలోచించి ఆలస్యం చేస్తే.. మేం కూడా రాజకీయంగానే ఎదుర్కొంటాం’ అని తెగేసి చెప్తున్నారు.
గవర్నర్ తన గౌరవాన్ని కాపాడుకొనేలా వ్యవహరిస్తే ఎలాంటి సమస్య ఉండదని.. రాజకీయాలకు దిగితే మాత్రం తాము కూడా సిద్ధమేనని కొందరు కార్మిక నాయకులు తేల్చిచెప్పారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేయనున్నట్టు ఒక సంఘం నేత ప్రకటించారు.