హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): సాగర్ డ్యామ్ దురాక్రమణ నేపథ్యంలో వివాద పరిష్కారం కోసం శుక్రవారం నిర్వహించనున్న సమావేశాన్ని వాయిదా వేయాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు తెలంగాణ సర్కారు విజ్ఞ ప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖకు సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు.
కృష్ణా జలాల పంపిణీ వివాద పరిషారం, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు ఇరు తెలుగు రాష్ర్టాలతో కేంద్రం ఇప్పటికే ఒక దఫా సమావేశాన్ని నిర్వహించింది. పూర్తిస్థాయిలో మరోసారి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఇంకా పూర్తిస్థాయిలో కాలేదని, ఈ నేపథ్యంలో నేటి సమావేశాన్ని వాయిదా వేయాలని సీఎస్ కోరారు. జనవరిలో సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు విజ్ఞప్తి చేశారు.